క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పాటించాల‌ని మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పిలుపునిచ్చారు. మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునేందుకు దీనిని త‌ప్ప‌కుండా పాటించాల‌ని ఆయ‌న కోరారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ‌లు కూడా త‌మ కార్య‌క‌లాపాల‌ను నిలిపివేశాయి. హోం డెలివ‌రీల‌ను ఆపేశాయి. దీంతో నిత్యావ‌స‌ర స‌రుకుల కోసం ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప‌లుచోట్ల పోలీసులు తీవ్ర‌స్థాయిలో స్పందిస్తున్నారు.  వాహ‌నాల‌న సీజ్ చేయ‌డం.. అవ‌స‌ర‌మైతే లాఠీల‌కు కూడా ప‌నిచెబుతున్నారు. ఇక తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని, లేనిప‌క్షంలో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని హెచ్చ‌రించారు. హైద‌రాబాద్‌స‌హా ప‌లు ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో ప్ర‌జ‌లు అడుగుబ‌య‌ట‌పెట్టేందుకు వ‌ణికిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో స‌రుకులు తెచ్చుకోవ‌డం ఎలా అంటూ ఓ వ్య‌క్తి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఓ ప్రశ్న వేశారు. 

 

అయితే.. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.  లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నిత్యావసరాలను హోం డెలివ‌రీ చేసే ప్రముఖ సంస్థలు బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను ఆపేశాయి. అయితే.. తిరిగి అవి కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేలా చేయాలని ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌ను ఆదేశించినట్లు కేటీఆర్‌ తెలిపారు. దీనివల్ల ప్రజలు స‌రుకుల కోసం ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని, త్వ‌ర‌లోనే ఆన్‌లైన్‌లోనే నిత్యవసరాలు కొనుక్కునే అవకాశం రావొచ్చని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి... లాక్‌డౌన్ విధించ‌ముందు.. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఆన్‌లైన్‌లోనే స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేసుకున్నారు. కానీ.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రం కావ‌డం, ప్ర‌ధాని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు పిలుపునివ్వ‌డంతో ఈ కామ‌ర్స్ సంస్థ‌లు హోం డెలివ‌రీల‌ను నిలిపివేశాయి. ఇప్పుడు మంత్రి కేటీఆర్ సూచ‌న మేర‌కు మ‌ళ్లీ హోం డెలివ‌రీలు చేస్తాయో లేదో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: