తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ‌మంత్రి హ‌రీష్‌రావుకు తెలుగు శార్వ‌రీ నామ‌ సంవ‌త్స‌రంలో రాజ‌కీయంగా ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌వా..? ఆయ‌నకు ప‌ని చేయ‌డం క‌త్తిమీద సాములా మారనుందా..? ఆయ‌న ఎందుకు కొన్ని మాసాల పాటు జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఎవ‌రితో ఎలా ప‌నిచేయాల్సి ఉంటుంది..?  ప్ర‌ముఖ జ్యోతిష్య పండింతులు సంతోష్‌కుమార్ శాస్త్రి చేసిన సూచ‌న‌లు ఇప్పుడు రాజ‌కీయాల్లో చ‌ర్చనీయాంశంగా మారాయి.  ఉగాదిని పురస్కరించుకుని హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం  సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్ర‌జ‌లంతా క్షేమంగా ఉంటార‌ని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఇబ్బందిపెట్టే అవకాశం ఉందన్నారు.

 

తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు ఉండవ‌ని స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంద‌ని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు భవిష్యత్తు బాగుంటుందని  చెప్పారు. అయితే అక్టోబర్ వరకు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ఈ ఏడాది ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు మాత్రం మీద సాము చేయాల్సి వస్తుందన్నారు. అనేక రాజ‌కీయ ఒడిదొడుకులు కూడా చోటుచేసుకునే ప్ర‌మాద‌ముంద‌ని, ఆయ‌న చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.  ఇక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

 

అయితే జూలై మాసంలో మాత్రం రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో  భూకంపాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మ‌రి కొన్ని చోట్ల వరదలు ముంచెత్తే ప్ర‌మాదమూ ఉంద‌ని తెలిపారు. ఇక సెప్టెంబర్ మాసంలో చెన్నై, ముంబై లాంటి ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ కూడా ఎలాంటి క‌రువు, కాట‌కాల్లేకుండా సుభిక్షంగా ఉంటార‌ని తెలిపారు. అంతకుముందు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శార్వరి నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఇదిలా ఉండ‌గా జ్యోతిష్కుడు చెప్పిన మాట‌ల‌తో హ‌రీష్‌రావు వ‌ర్గంలో మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌జాబ‌ల‌మున్న హ‌రీష్‌రావు ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొగ‌ల‌డు అంటూ ఆయ‌న అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: