ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తిస్తోన్న క‌రోనా వైర‌స్ ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికాను సైతం వ‌ణికించేస్తోంది. అమెరికాలో క‌రోనాకు బ్రేకులు వేయడంలో ప్ర‌భుత్వం సైతం విఫ‌ల మ‌వుతోంది. దీంతో చివ‌ర‌కు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సైతం చైనాను విమ‌ర్శించారు. చైనా చేసిన ప‌నికి ఇప్పుడు ప్ర‌పంచం ఎన్నో క‌ష్టాలు అనుభ‌విస్తోంద‌ని.. ఈ పాపం డ్రాగ‌న్‌దే అని ఆయ‌న విమ‌ర్శించారు. అయితే క‌రోనా విష‌యంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవ‌డంలోనూ అగ్ర‌రాజ్యం ఘోరంగా విఫ‌ల‌మైంది. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు ప‌ట్ట‌కున్న చందంగా నాలుగు కృత్రిమ హాస్ప‌ట‌ల్స్ నిర్మించారు. ఇందులో 2 వేల ప‌డ‌క‌లు ఏర్పాటు చేస్తున్నారు. 

 

ప్ర‌పంచం మొత్తంలో ఉన్న కరోనా బాధితుల్లో 5 శాతం క‌రోనా బాధితులు న్యూయార్క్‌లోనే ఉన్నారు. ఇక ఇప్ప‌టికే అక్క‌డ వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు లాక్ డౌన్ అమ‌ల్లోకి తెచ్చింది. దీంతో 8 రాష్ట్రాల్లో కొన్ని ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు నిర్బంధానికి గుర‌య్యారు. అస‌లు ఎవ‌రు బ‌తుకుతారో ?  ఎవ‌రు చ‌నిపోతారో ?  తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. న్యూయార్క్‌, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ప‌రిస్థితి తీవ్రంగా ఉంది. ఇక యువ‌త‌ను ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని ట్రంప్ సూచించారు. 

 

ఇక్క‌డ ఉన్న 16 వేల మంది క‌రోనా బాధితుల్లో 53 శాతం మంది 18 - 49 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉన్న యువ‌తే ఎక్కువుగా ఉన్నారు. ఇక్క‌డ క‌రోనా ప్ర‌ధానంగా యువ‌త‌ను కూడా క‌బ‌లిస్తోంద‌ని స్ప‌ష్టంగా లెక్క‌లే చెపుతున్నాయి. వాస్త‌వంగా క‌రోనా ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు పాకుతోన్న క్ర‌మంలో చాలా దేశాలు ముందుగానే ఎలెర్ట్ అయ్యాయి. అయితే ఇట‌లీ, అమెరికా మాత్రం కాస్త నిర్ల‌క్ష్య ధోర‌ణితో ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈ రెండు దేశాలు అందుకు త‌గ్గ మూల్యం చెల్లించు కోక త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చేసింది. మ‌రి ఇప్పుడు అమెరికా క‌రోనాకు బ్రేక్ వేసేందుకు తీసుకుంటోన్న చ‌ర్య‌లు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: