బీజేపీ జనసేన పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని కార్యాచరణ రూపొందించుకున్నాయి. అంతే కాదు వచ్చే ఎన్నికల నాటికి మరింతగా బలపడి ఎన్నికల్లో పోటీ చేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు ధీటుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామే అంటూ గంభీరంగా ప్రకటించాయి. ఇంతవరకు బాగానే ఉన్నా... పొత్తు పెట్టుకున్న తర్వాత వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి ఉమ్మడిగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నామినేషన్లు ఈ రెండు పార్టీలు కలిసి దాదాపుగా నాలుగువేల వరకూ మాత్రమే వేయగలిగాయి. అయితే ఏపీ  అధికార పార్టీ వైసీపీ మాత్రం 23 వేలకు పైగా నామినేషన్లు వేస్తే టీడీపీ 18 వేల వరకు నామినేషన్స్ వేసింది. అంటే బీజేపీ, జనసేన మొత్తం సీట్లలో సగానికి కూడా నామినేషన్లు బీజేపీ జనసేన పార్టీలు కలిసి వేయలేకపోయాయి.

 

బీజేపీకి మొదటి నుంచి ఏపీ మీద పెద్దగా ఆశలు లేవనే చెప్పాలి. మొదటి నుంచి బీజేపీ వ్యవహారాలను ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమే చూసుకుంటూ ఉండేవారు. మొత్తం అయన మాత్రమే వ్యవహారాలు నడిపిస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఏపీ వ్యవహారాలను వెంకయ్య చూసుకునే అవకాశం లేకపోవడం, మిగిలిన నాయకులకు ఢిల్లీతో సంబంధాలు అంతంతమాత్రంగా ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ అగ్ర నేతలు పట్టించుకోవడం మానేశారు. ఇక జనసేన పార్టీ ఉన్నా క్షేత్ర స్థాయిలో బలం లేకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి ఇదే పరిస్థితిలో ఉంది. ఏపీ వ్యవహారాలు మీద బీజేపీ అగ్ర నేతలు పెద్దగా ఫోకస్ పెంచలేకపోతున్నారు. వాస్తవానికి ఏపీలో బలమైన నాయకులు బీజేపీకి లేకపోవడం వల్లనే కేంద్రం కూడా ఏపీలో పార్టీని బలోపేతం చేసే విషయంలో చిన్న చూపు చూస్తోందని అంటున్నారు. 

 

IHG


ఇక్కడ నాయకులు జగన్ ని తిట్టినా ఢిల్లీ పెద్దలు మాత్రం మౌనంగా ఉండడంతో అసలు బీజేపీ స్టాండ్ ఏంటో ఎవరికీ అర్ధం కాకుండా ఉంది. ఏపీ బీజేపీ నాయకులు ఒకలా, కేంద్ర బీజేపీ నాయకులు ఒకలా వ్యవహరించడంతో అందరిలోనూ గందరగోళం నెలకొంది. ప్రస్తుతానికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ఇప్పటికైనా బీజేపీ జనసేన నాయకులు పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టిపెట్టి మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తారో లేక తమకు బలం లేదు అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఇదే విధంగా పోటీకి దూరం దూరంగా ఉంటారా అనేది చూడాలి 

 

మరింత సమాచారం తెలుసుకోండి: