ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను సరిగ్గా అమలు చేయడం కోసం పోలీసులు కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చాలా ప్రాంతాలలో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వ్యక్తి ఎవరో... బయటకు ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా దాడులకు పాల్పడుతున్నారు. 
 
భద్రతా చర్యల్లో భాగంగా ప్రజలు రోడ్ల మీద అనవసరంగా తిరగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు టోలిచౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో సయ్యద్ బిలాల్ అనే వ్యక్తిని విపరీతంగా కొట్టారు. అనంతరం ఆ వ్యక్తి ఎవరో తెలిసి షాక్ అయ్యారు. ప్రతిరోజు మెటర్నిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మానవ హక్కుల వేదిక ఉపాధ్యక్షుడైన సయ్యద్ బిలాల్ భోజనం అందజేస్తాడు. 
 
కొంతమంది దాతల ద్వారా విరాళాలు సేకరించి కొన్నేళ్లుగా సయ్యద్ బిలాల్ రోగులకు ఉచితంగా భోజనం అందజేస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం దాత నుంచి డబ్బులు తీసుకునేందుకు వెళ్లే సమయంలో పోలీసులు సయ్యద్ ఎక్కడికి వెళుతున్నాడు...? ఎందుకు వెళుతున్నాడు...? అనే విషయాలు తెలుసుకోకుండా విపరీతంగా కొట్టారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం వాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
సయ్యద్ కు తగిన న్యాయం జరగాలని... దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు ప్రజలు పాటించేలా చేయడంలో తప్పు లేదు కానీ అనవసరంగా లాఠీఛార్జ్ చేయడం సరికాదని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో పోలీసులు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని చెబుతూ ఉండటం గమనార్హం. కొందరు నెటిజన్లు పోలీసులు కరోనా వ్యాప్తి చెందకుండా చేపట్టిన చర్యల్లో భాగంగా దాడి చేసి ఉండవచ్చని కామెంట్లు చేస్తుంటే... మరికొందరు మాత్రం పోలీసుల ఓవరాక్షన్ అంటూ విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: