కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. గత కొన్ని రోజుల నుంచి కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనుందని వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఈరోజు ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ లక్షా 70 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ రూపొందించినట్లు చెప్పారు. వైద్యులకు 50 లక్షల రూపాయల ప్రత్యేక బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటన చేశారు. వైద్యులతో పాటు శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, నర్సులకు బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటన చేశారు. 
 
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. అత్యవసర సేవల్లో భాగంగా వైద్యులు రోగులకు నిరంతరం సేవలు అందించాల్సి ఉంది. కొన్ని సార్లు రోగుల నుంచి వైద్యులకు, ఇతర సిబ్బందికి వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కేంద్రం 50 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల్లో పని చేస్తున్న ఆరోగ్య సహాయకులందరికీ బీమా పథకం వర్తించనుంది. 
 
ఆర్థిక మంత్రి ఈ నిర్ణయంతో పాటు కరోనా ఉపశమన చర్యల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. కేంద్రం 3 నెలల పాటు 80 కోట్ల మంది తెల్లరేషన్ కార్డుదారులకు అదనంగా 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, కేజీ పప్పు సరఫరా చేయనుంది. పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయనుంది. పీఎం కిసాన్ తొలి విడత డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేయనుంది. 
 
ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం 202 రూపాయలకు పెంచింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రెండు విడతలుగా వెయ్యి రూపాయలు ఇవ్వనుంది. నెలకు 500 రూపాయలు చొప్పున జన్ ధన్ ఖాతాలు ఉన్న మహిళలకు కేంద్రం నగదు జమ చేయనుంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇవ్వనుంది. కరోనా విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: