సీఎం జగన్ ఏపీ సచివాలయం నుండి మీడియాతో మాట్లాడుతూ కరోనాను జయించడానికి కొత్త ఐడియా చెప్పారు. కరోనాను క్రమశిక్షణతోనే జయించగలమని అన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తక్కువగానే ఉందని... ఏపీలో 10 కేసులు పాజిటివ్ గా తేలాయని వెల్లడించారు. నిన్న ఏపీ సరిహద్దుకు వచ్చిన 196 మందిని క్వారంటైన్ కు తరలించామని... వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచకతప్పదని అన్నారు. 
 
కరోనాను తేలికగా తీసుకుంటే ఈ వ్యాధి ఎప్పటికీ సమసిపోదని పేర్కొన్నారు. ఏప్రిల్ 14 వరకు ప్రజలందరూ ఎక్కడికీ తిరగకుండా ఇళ్లకే పరిమితమైతే వైరస్ వ్యాప్తిని నివారించగలమని తెలిపారు. కరోనాను అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో చర్యలు చేపట్టామని తెలిపారు. వాలంటీర్లకు, హెల్త్ అసిస్టెంట్లకు, ఆశా వర్కర్లకు మనస్పూర్తిగా హ్యాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఉంది కాబట్టే కరోనాను ఎదుర్కోగలుగుతున్నామని వెల్లడించారు. 
 
రైతులు పొలం పనులకు వెళ్లినా తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉంటే కరోనాను నియంత్రించగలమని... వందేళ్లకు ఒకసారి ఇలాంటి వైరస్ వస్తుందేమేనని అన్నారు. మనం సమర్థవంతంగా ఇలాంటి వైరస్ లను ఎదుర్కోవాలని లేదంటే భావి తరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రానికి విదేశాల నుంచి 27,819 మంది వచ్చారని... వారందరినీ సర్వైలెన్స్ లో ఉంచామని చెప్పారు. 
 
ప్రతి జిల్లాలో 200 బెడ్ లను ఏర్పాటు చేశామని... ప్రతి నియోజకవర్గంలో 200 పడకలను క్వారంటైన్ కోసం సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రబలితే అవసరమైన చర్యలతో ముందస్తుగా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనాను నివారించాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని... ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 1902కు కాల్ చేయాలని సూచించారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే 104కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: