ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5,00,000 దాటింది. కరోనా భారీన పడి 24,070 మంది మృతి చెందారు. మన దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 45కు చేరగా ఏపీలో 11 మందికి కరోనా సోకింది. కేంద్రం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోంది. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదు. 
 
కొన్ని ప్రాంతాలలో ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారని తెలియడంతో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలను జారీ చేసింది. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే కేంద్రం లాక్ డౌన్ నుంచి ఆసుపత్రులు, పాల డెయిరీలు, రేషన్ షాపులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, బ్యాంకులకు మినహాయింపు ఇచ్చింది. 
 
దేశంలో కరోనా కేసులు 700 దాటినట్లు తెలుస్తోంది. కరోనా భారీన పడి 20 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజులోనే 7 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో దేశంలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో 137, మహారాష్ట్రలో 125, తెలంగాణ 45, కర్ణాటక 55, ఉత్తరప్రదేశ్ లో 42 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ కేసుల సంఖ్య పెరుగుతున్నా బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతోంది. 
 
కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలు లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే కరోనా సామూహిక వ్యాప్తి జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. నిన్న హైదరాబాద్ లో ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్ అని తేలడంతో నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు డాక్టర్లను కలిసిన రోగుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే మాత్రమే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని ఇరు రాష్ట్రాల సీఎంలు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: