ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో ఎక్కడ వ్యవస్థలు అక్కడ ఆగిపోయాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ అయ్యాయి. అయితే ఈ సందర్భంగానే తెలుగు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన సంకేతం కూడా కనిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏకంగా ష‌ట్ డౌన్‌ అయినట్టు తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి కూడా చంద్రబాబు ఉన్న కాస్త ప‌రువు కూడా పోగొట్టుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా క‌రోనా వైరస్ నేపథ్యంలో ఇక్కడ రాజకీయ పరిస్థితులను గమనిస్తుంటే... ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ ఆశలు అన్నింటిని చంద్రబాబు పూర్తిగా వదిలేసినట్టు కనిపిస్తోంది.



కరోనా ధాటికి విలవిల్లాడుతున్న సామాన్య ప్రజానీకానికి ఆప్త హస్తం అందించేందుకు ప్రముఖులందరూ భూరి విరాళాలు ప్రకటిస్తుండగా.. చంద్రబాబునాయుడు కేవలం పది లక్షలరూపాయలు, అది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఓ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన వ్య‌క్తి ఆ రాష్ట్రంలో అధికారం కోసం పోరాటం చేస్తూ కేవ‌లం రు. 10 ల‌క్ష‌లు మాత్ర‌మే విరాళం ఇవ్వ‌డంతో ఇప్ప‌టికే అక్క‌డ ఆయ‌న‌పై జోకులు కేకుల్లా పేలుతున్నాయి.



ఇక తెలంగాణ గురించి చంద్ర‌బాబు ఎంత మాత్రం ప‌ట్టించుకున్న‌ట్టు లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీని కేవ‌లం రెండు సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. అందులోనూ స‌త్తుప‌ల్లితో పాటు అశ్వారావుపేట‌లో టీడీపీ గెలిచింది. ఈ రెండు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోనివే. ఇక ఆ త‌ర్వాత జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అభ్య‌ర్థులు లేక‌పోవ‌డంతో చేతులు ఎత్తేశారు. ఇక భ‌విష్య‌త్తులో ఇక్క‌డ పార్టీ బ‌తుకుతుంద‌న్న ఆశ‌లు లేక‌పోవ‌డంతోనే చంద్ర‌బాబు ఇప్పుడు క‌రోనా నేప‌థ్యంలో ఒక్క రూపాయి కూడా విదల్చ‌లేద‌ని అంటున్నారు. చివ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం త‌న వంతుగా విరాళం ఇచ్చినా చంద్ర‌బాబు మాత్రం చేతులు దులిపేసుకున్నారు. దీనిని బ‌ట్టి తెలంగాణ‌లో టీడీపీ దుకాణం బంద్ చేసిన‌ట్టే అనుకోవాలిగా..?

మరింత సమాచారం తెలుసుకోండి: