తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 47కు చేరింది. ఈరోజు మంత్రి ఈటల రాజేందర్ కోటి మెడికల్ కాలేజీలో వైద్య శాఖ అధికారులు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. మంత్రి కేసుల సంఖ్య 47కు పెరిగిందని... సీఎం ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లోను వైద్య సదుపాయాలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి రాష్ట్రానికి వచ్చిన విదేశీయులే కారణమని అన్నారు. 
 
రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని రెండు మూడు రోజుల్లో వారు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో త్వరలోనే కరోనా కట్టడి అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 22 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయని, అవసరమైతే వాటిని ఉపయోగించుకుంటామని చెప్పారు. ప్రభుత్వం మొదటి దశలో ప్రభుత్వ ఆస్పత్రులను, రెండో దశలో ప్రైవేట్ ఆస్పత్రులను ఉపయోగించుకునేలా ప్రణాళికను రూపొందించిందని అన్నారు. 
 
ప్రైవేట్ వైద్య కళాశాలలు కరోనాకు చికిత్స అందించేందుకు సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వం ప్రైవేట్ వైద్యులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా బాధితుల కోసం 10,000 పడకలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటన చేశారు. 190 వెంటిలేటర్లు, 700 ఐసీయూలు కరోనా బాధితుల కోసం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 
 
రాష్ట్రంలో కరోనా బాధితులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ప్రకటన చేశారు. ప్రజలకు ధైర్యం, భద్రత కల్పించడానికి ప్రభుత్వం వెనుకాడదు అని అన్నారు. దేశం అబ్బురపడేలా అన్ని రకాలుగా పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నామని తెలిపారు. దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. కరోనా భయాందోళన నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమవుతున్నారు.     
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: