తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రావాళ్లకు శుభవార్త చెప్పారు. రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉందని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు తీసుకురామని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందినవారైనా... ఏ రాష్ట్రానికి చెందినవారైనా వారిని ఉపవాసం ఉండనీయబోమని అన్నారు. ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 
 
ఇతర రాష్ట్రాల విద్యార్థులు హైదరాబాద్ లో హాస్టళ్లు మూసివేస్తున్నారని భయపడుతున్నారని... వారు భయాందోళనకు గురి కావాల్సిన అవసరమే లేదని చెప్పారు. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని... కరోనా కట్టడి కోసం కృషి చేయాలని అన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు రాష్ట్రంలో రైస్ మిల్లుల్లో, భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆకలితో ఎవరినీ అలమటించనీయమని అన్నారు. 
 
అనాథలు, యాచకులు, పేదలు ఎవరూ ఆకలికి గురి కాకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలు చికెన్, గుడ్లు తినాలని సీఎం సూచించారు. బత్తాయి, దానిమ్మ, సంత్రాలను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. రైతులు సంయమనం పాటించాలని... మానసిక ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. మార్కెట్ యార్డులు మూసి ఉన్నాయని... వ్యవసాయ మార్కెట్ సిబ్బందే గ్రామాలకు వస్తారని సీఎం తెలిపారు. 
 
రైతుల దగ్గర నుండి ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులకు పంటలకు సంబంధించిన చెక్కులను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. రైతులు వారి ఇష్ట ప్రకారం వ్యాపారులకు లేదా ప్రభుత్వానికి పంటను అమ్ముకోవచ్చని అన్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు వ్యవసాయ అధికారులతో, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని సీఎం తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కు చేరింది. ఒక్కరోజే పది కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: