ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చిన లాక్ డౌన్ ఒక యువకుడి ప్రాణం తీసింది. కర్నూలు జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న ఒక యువకుడు పోలీస్ జీప్ రావడంతో లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుందని పారిపోయాడు. భయంతో పరుగెత్తిన యువకుడు కింద పడిపోయి చనిపోయాడు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివణం గ్రామానికి చెందిన సిద్ధయ్యస్వామి, గౌరమ్మ కుమారుడు వీరభద్ర స్వామి బెంగళూరులో పని చేసుకుంటూ జీవించేవాడు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సొంతూరుకు చేరుకున్నాడు. చాలా రోజుల తరువాత సొంతూరికి రావడంతో స్నేహితులను కలిసి రహదారి పక్కన కూర్చుని ఊరి విశేషాలు, ఇతర విషయాలు చర్చించాడు. 
 
అదే సమయంలో అటుగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది. పోలీసులు రహదారి పక్కన మాట్లాడుకుంటున్న యువకులను చూసి వాహనాన్ని ఆపారు. పోలీసులు క్రిందకు దిగి యువకులను వెంబడించారు. పోలీసులు వెంబడించడంతో యువకులు తప్పించుకొని తలో దిక్కుకు పారిపోయారు. అలా భయంతో వేగంగా పరుగెత్తిన వీరభద్ర స్వామి ప్రమాదవశాత్తూ చనిపోయాడు. 
 
వీరభద్ర స్వామి చనిపోయాడన్న వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొడుకు మృతి చెందటంతో వీరభద్ర స్వామి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. కరోనా భారీన పడితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది. ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతూ ఉండటంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కు చేరింది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: