కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్, బ్రిటన్.. ఇలా ఒకటేమిటి అనేక దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇక అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి మరీ దారుణం..  
అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. అగ్రరాజ్యం అమెరికాలో 345 మంది ప్రాణాలు వదిలారు. మృతుల సంఖ్య 14వందల 77కు పెరిగింది. అగ్రరాజ్యంలో అత్యధికంగా ఒకేరోజు 18వేల కేసులు నమోదయ్యాయి.


ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం 53వేల 290 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 5లక్షల 85వేలకు చేరుకుంది. కరోనా ధాటికి చనిపోయిన వారి సంఖ్య 26వేల 367కు చేరింది. కొత్తగా 2వేల759 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇటలీలోనే 969మంది చనిపోయారు. వైరస్‌ బయటపడిన తర్వాత ఇటలీలో ఒకేరోజు ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. 


ఇటలీలో ఇప్పటివరకూ 9వేల 134 మంది మృతిచెందారు. స్పెయిన్‌లో ఒకేరోజు 569 మంది చనిపోయారు. మొత్తం సంఖ్య 5వేలకు చేరువైంది. ఫ్రాన్స్‌లో 299 మంది, బ్రిటన్‌లో 181 మంది చనిపోయారు. ఇరాన్‌లో 144 మంది, నెదర్‌లాండ్స్‌లో 112 మంది ప్రాణాలు కోల్పోయారు. బెల్జియంలో 69, జర్మనీలో 54, స్విట్జర్లాండ్‌లో 39 కొత్త మరణాలు సంభవించాయి. 


కరోనా పుట్టిన చైనాలో మృతుల సంఖ్య 3వేల 292 ఉండగా, ఇరాన్‌లో 2వేల 378కి చేరింది. టర్కీలో కొత్తగా 2వేల 69 కేసులు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన 5లక్షల 85వేల కేసుల్లో 3లక్షలు ఐరోపాలోనే ఉన్నాయి. జర్మనీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50వేల 178కి చేరుకుంది. యావత్‌ ప్రపంచానికి విస్తరించిన కరోనా మహమ్మారి ధాటికి దేశాలకు దేశాలే విలవిలలాడుతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎన్నోచర్యలు తీసుకుంటున్నా నిత్యం వేల సంఖ్యలో బలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: