ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలనుకునేవారు మధ్యాహ్నం ఒకటి లోపే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో, మండలాల్లో ఎటువంటి సమస్య లేదు కానీ పట్టణాల్లో సూపర్ మార్కెట్లు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి జిల్లాలో వినియోగదారులకు నిత్యావసర వస్తువులు అందే విధంగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కావాల్సిన సరుకుల జాబితాను వాట్సాప్ చేస్తే చాలు సరుకులు నేరుగా ఇంటికి చేరుకుంటాయి. రాష్ట్రంలో ప్రభుత్వం సూపర్ మార్కెట్ల నుంచి నేరుగా వినియోగదారుల ఇళ్లకు నిత్యావసర వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టింది. 
 
ఈ విధానాన్ని మొదట విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రవేశపెట్టగా ఇతర మున్సిపాలిటీలలో, పంచాయతీలలో కూడా ఈ విధానం అమలులోకి వచ్చింది. సరుకుల డోర్ డెలివరీ కొరకు సూపర్ మార్కెట్ల యజమానులతో చర్చలు జరిపి మోర్, బిగ్ బజార్, రిలయన్స్, డీ మార్ట్, మెట్రో, ఇతర సూపర్ మార్కెట్ల ఫోన్ నంబర్లతో ప్రకటనలు ఇచ్చారు. సూపర్ మార్కెట్ల వాట్సాప్ నంబర్లకు వినియోగదారులు సరుకుల వివరాలను, చిరునామాను పంపి ఫోన్ చేస్తే 24 గంటల్లో సరుకులు డోర్ డెలివరీ చేస్తారు. 
 
కానీ కనీసం వెయ్యి రూపాయల సరుకులు కొనుగోలు చేస్తే మాత్రమే డోర్ డెలివరీ సదుపాయం అందుబాటులో ఉంటుంది. రాజమండ్రి, కాకినాడలలో నిన్నటినుండి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కర్నూలు, తిరుపతిలో కూడా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల ఇళ్లకు సూపర్ మార్కెట్ల నుంచి డోర్ డెలివరీ చేయడం పట్ల ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు.                     

మరింత సమాచారం తెలుసుకోండి: