ఇదేంటండి బాబు...క‌రోనా అంతా క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతుంటే... వ‌ణికిపోతుంటే...భ‌యంతో కొంద‌రు చ‌చ్చిపోతుంటే...మీరేమో ఇలా చెప్పేస్తున్నారు...క‌రోనా మ‌న‌కు మంచి చేసింది అని. నిజంగానే మంచి జ‌రిగింది కాబ‌ట్టే ఈ విష‌యం. క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోడీ దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్ర‌జా జీవితం స్తంభించింది. రోడ్ల మీద వాహనాలు తిరగడం ఆగిపోయాయి. స‌హ‌జంగానే గాలిలో కాలుష్యం తగ్గింది. దీంతో గాలిలో ఆక్సిజ‌న్ నాణ్య‌త పెరిగింది.

 


ఇదిలాఉండ‌గా, బుధవారం నుంచి భారత్‌ సంపూర్ణంగా లాక్‌డౌన్‌లోకెళ్ళిపోయింది. ఇది 21రోజుల పాటు కొనసాగుతుంది. అంతకుముందే ప్రపంచ జనాభాలో 20శాతం మంది లాక్‌డౌన్‌లో ఉన్నారు. భారత్‌లోని 130కోట్ల మంది ఈ జాబితాకు తోడయ్యారు. దీంతో ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ముగ్గురు స్వచ్ఛంద నిర్భందం లో ఉన్నట్లవుతోంది. ఇలా దేశంలో విధించిన లాక్ డౌన్‌కు ముందు ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. గాలి పీల్చుకునేందుకు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి. దీంతో...ప్రభుత్వం కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు కూడా చేపట్టింది. అయితే,  కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ ఫలితంగా వైరస్ కట్టడితో పాటు కాలుష్యం కూడా గణనీయం తగ్గింది. ముఖ్యంగా నోయిడాలో గాలి నాణ్య‌త‌ సూచీ 76తో సంతృప్తికరంగా ఉండగా ఘజియాబాద్ లో 96తో మధ్యస్థంగా నమోదైంది. మరో ఇరవై రోజులు లాక్ డౌన్ కొనసాగనుండగా ఈ నాణ్యత మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుందని...ఇది సంతోష‌క‌ర ప‌రిణామ‌మ‌ని అంటున్నారు. 

 

ఇదిలాఉండ‌గా, కేంద్రం పెద్ద ఎత్తున ఆర్థిక స హకార చర్యల్ని చేపట్టింది. అలాగే రోగుల్ని, అనుమానితుల్ని కూడా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. దేశంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదు అన్న దృక్పధాన్ని ప్రదర్శిస్తోంది. దేశవ్యాప్తంగా ఏ జాతి, ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతానికి చెందిన వారికైనా కడుపు నింపేందుకు ముందుకొస్తోంది. రోగగ్రస్తులకు చికిత్స అందిస్తోంది. మరోవైపు అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తూ ఇంకోవైపు విదేశాల నుంచి వ‌చ్చిన వారందర్నీ ఐసోలేషన్‌ వార్డుల్లో చేర్చి అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఆకలి బాధితుల వైపు దృష్టి సారించాయి. దేశం మొత్తం మూడు మాసాల పాటు ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కార్మికులు, దిగువ మధ్యతరగతి ప్రజలకు పలు రాయితీలు, వెసులుబాట్లు ప్రకటించింది. ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: