కరోనా వైరస్ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎవరికి వారుగానూ, ఉమ్మడిగానూ భయపడిపోతున్న సందర్భమిది. ఈ నేపధ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ లో కూడా ఎన్నో వింతలూ విశేషాలూ చోటు చేసుకోవడమే అసలైన  విచిత్రం.

 

ఇక కరోనా వైరస్ అని అంతా ఇంట్లో కూర్చోవాలని ప్రభుత్వం హెచ్చరికలు ఓ వైపు జారీ చేస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే విశాఖ సిటీ అరిలోవ ఇపుడిపుడే నగరం విస్తరిస్తున్న శివారు ప్రాంతం. ఇక్కడ పగలు బాగానే  ఉన్నా రాత్రి అయ్యేటప్పటికి ఆకతాయిలు, రౌడీ మూకలు వీర విహారం చేయడం ఎపుడూ ఉన్న కధే.

 

ఇపుడు కరోనా వైరస్ వల్ల అంతా లాక్ డౌన్ అంటూ ఇంటికే పరిమితమైతే పగలే నిర్మానుష్యంగా ఉంది. దాంతో ఇపుడు ఆకతాయిలకు పట్ట పగలే రెక్కలు వచ్చేశాయి. వారు కరోనా కంటే దారుణంగా మారి ఆడపిల్లలను వేధిస్తున్నారట. అంతా టీనేజ్ కుర్రాళ్ళే, వారు చేసేది కూడా అక్రమ వ్యవహారమే.

 

వారు గంజాయి, మద్యం బాటిళ్ళను అక్రమంగా తరలిస్తూ ఆ అమ్మకాలతో అడ్డదోవలో ధన సంపాదన చేస్తున్న వారు. వీరికిపుడు కరోనా వల్ల ఆట విడుపు గా ఉంది. పగలే తమ అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దానికి తోడు అన్నట్లుగా వీరు అమ్మాయిలపైన పట్ట పగలే వేధిమిలకు దిగుతున్నా పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడని అరిలోవ సెక్టార్ 5 కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

మాకు కరోనా కంటే  ఈ వైరస్ ఎక్కువైపోతోంది.  రక్షించడంటూ వేడుకుంటున్నారు. కానీ పోలీసులు సైతం ఈ ఆకతాయిలను చూసీ చూడనట్లుగా వదిలేయడం గట్టిగా ఎవరైనా చెబితే కాసేపు ఉంచి మళ్ళీ  పంపేస్తున్నారుట. దాంతో వీరికి హద్దూ పద్దూ లేకుండా పోతోందని ఆడపిల్లల తండ్రులు ఆందోళన‌ చెందుతున్నారు.

 

పోలీసులంతా కరోనా వైరస్ నియంత్రణలో ఉంటే ఈ కీచకుల కరోనా కోరల్లో అరిలోవ వాసులు చిక్కుకున్నారని అంటున్నారు. మరి పోలీసులే వీరి పనిపట్టి ఈ వైరస్ ని అంతం చేయాలని కోరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: