పిల్లలన్న తర్వాత ఏదో ఒక అవలక్షణం అలవరచుకుంటూనే ఉంటారు. అయితే ఆ అవలక్షణాలన్నీ మొగ్గలోనే మీరు తుంచేయాలి. చెడు లక్షణాలు/ ప్రవర్తన పిల్లల భవిష్యత్తును సర్వ నాశనం చేస్తాయన్న విషయం అందరికి తెలిసిందే. కానీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల అవలక్షణాలను తొందరగా గుర్తించరు... ఒకవేళ గుర్తించినా వారిని గట్టిగా గద్దయించకుండా గారాభం చేస్తుంటారు. అలా చేయడం వలన మీ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. నిజానికి మీ పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత పూర్తిగా మీ మీదనే ఉంటుంది.




అందరి పిల్లల్లో సాధారణంగా... పెద్దలు మాట్లాడుతుంటే జోక్యం చేసుకోవడం, నిజాలను అబద్దాలుగా మార్చి చెప్పడం, బంధువులను గిల్లడం గిచ్చడం కొరకడం లాంటి అవలక్షణాలు ఉంటాయి. ఒకవేళ మీరు ఎవరితోనైనా పెద్దలతో మాట్లాడుతుంటే మీ పిల్లలు జోక్యం చేసుకున్నారనుకోండి... కన్నెర్ర చేసి వారిని వెంటనే సైగలతో గద్దయించండి. మీ సంభాషణ అనంతరం... మీ పిల్లల్ని దగ్గరికి పిలిచి 'మాట్లాడుతుంటే మధ్యలో జోక్యం చేసుకోకూడదని' కాస్త గంభీరంగా చెప్పండి. ఇలా చేయడం వలన వారికి మంచి ప్రవర్తన అలవడుతుంది.





కొంతమంది పిల్లలు... బంధువుల పిల్లలను, స్నేహితులను కొట్టడం కొరకడం గిచ్చడం లాంటి హింసాత్మక ప్రవర్తన ని కలిగి ఉంటారు. ఈ ప్రవర్తన అత్యంత చెడ్డది. ఈ హింసాత్మక ప్రవర్తనని చాలా చక్కనైన మార్గదర్శకత్వం ద్వారా మార్చవచ్చు. ఎదుటి వారిని హింసించడం పాపం అని పదే పదే చెప్పడం వలన మీ పిల్లల హింసాత్మక ప్రవర్తన మారే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల మాటలను అస్సలు ఖాతరు చేయరు. మీ పిల్లలు ఒకవేళ అలా ప్రవర్తిస్తుంటే... వెంటనే వారిని దగ్గరికి తీసుకుని చాలా సున్నితంగా మాట్లాడుతూ... పెద్దల మాట వినాలని అర్థమయ్యేలా చెప్పండి. ఒకవేళ మీరు ఇటువంటి పిల్లలు దండిస్తే వారు ఇంకా మొండిగా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే వీరితో సున్నితత్వం గా డీల్ చేయడం ఎంతైనా ముఖ్యం. ఇకపోతే నిజాలు అబద్దాలుగా మార్చి చెప్పడమనేది మీ పిల్లల చెడు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ అబద్దాలు చెప్పే ప్రవర్తనని ఎంత త్వరగా మాన్పిస్తే మీ పిల్లలకు అంత మంచిది. ఇంకా ఇతర అవలక్షణాలు కూడా చెడు ప్రవర్తన కేటగిరీలోకి వస్తాయి. వాటిని కూడా మీరు మాన్పించడానికి ప్రయత్నించండి.




మరింత సమాచారం తెలుసుకోండి: