చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. ఆయన భూత భవిష్యత్తు, వర్తమానాలన్నీ  ఒకే కాలంలో చూస్తారు. అదే ఆయన గొప్పతనం. అందుకే డెబ్బయ్యేళ్ళ వయసులో కూడా పార్టీ ఘోర పరాజ‌యం తరువాత సైతం నేతలెవరూ సహకరించకున్నా పచ్చ పార్టీ బండిని ఏదోలా 
లాక్కువస్తున్నారు. బాబుకి తన మీదే కాదు, టైం మీద అంతటి విశ్వాసం ఉంది మరి.

 

జగన్ సర్కార్ మొదటి నుంచి పడుతూ లేస్తూ వస్తోంది. ఎందుకంటే అయిదేళ్ళ కాలంలో చేయాల్సిన అప్పులన్నీ చంద్రబాబు చేసేశారు. ఎక్కడా కూడా పరపతి, పలుకుబడి లేకుండా అన్ని రకాలైన వనరులను వాడేసుకున్నారు. మళ్ళీ తానే వస్తానని బాబు ఈ రకంగా స్వేచ్చగా పాలించారని అంటారు. ఆయనలో వెయ్యోవంతు కూడా తాను మళ్ళీ రానని అనుమానం లేదు. ఒకవేళ తానే మళ్ళీ వచ్చినా ఇక వైసీపీ రేసులో ఉండదు కాబట్టి అపుడు కూడా ఏం చేసినా చెల్లుతుందని కూడా లెక్కలేసుకున్నారు.

 

అయితే సీన్ రివర్స్ అయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ కి జనం 151 సీట్లు కట్టబెట్టారు అన్న ఆనందం తప్ప అయనకు వేరే విధంగా ముఖ్యమంత్రి పదవి సంబరాన్ని అందించలేకపోతోంది. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని సరిచేసేందుకు ఆయన ఇంకా ఇపుడే  పని మొదలుపెట్టారు. ఈ పనిలో బిజీగా  ఉండగానే కరోనా వైరస్ వచ్చింది.

 

దాని ప్రభావం రెండు విధాలుగా ఉంటుంది. ఇపుడు కరోనా వైరస్ వల్ల ప్రాణ  ముప్పు తప్పినా రేపటి రోజున ఆర్ధికంగా ఏపీ కుప్పకూలడం ఖాయం. మళ్ళీ ఏపీ సాధారణ స్థితికి వచ్చేసరికి కచ్చితంగా రెండు మూడేళ్ళు అడుతుంది. అప్పటికి సాధారణ  ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తాయి.

 

జగన్ అనుకున్న విధంగా ఇకపైన ముందుకు సాగలేరు. ఎందుకంటే ఏపీలో నిధుల కొరత ఎప్పటికపుడు బ్రేకులు వేస్తూనే ఉంటుంది. కేంద్రం కూడా ఎటువంటి సాయం చేసే స్థితిలో ఉండదు. మొత్తం ప్రపంచం అంతా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన వేళ ఆ దెబ్బ నేరుగా పాలకులకే తగులుతుంది. ఈ మొత్తం భవిష్యత్తు దర్శనం చంద్రబాబు బాగానే చేయగలరు.

 

అందువల్ల ఆయన ఇపుడు చాలా రిలాక్స్ గా ఉంటున్నారు. మిగిలిన నాలుగేళ్ళ కాలం జగన్ సర్కార్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటే అది ప్రతిపక్ష టీడీపీకే లాభం అనడంలో సందేహం లేదు. అందుకే జగన్ సినిమాలో సెకండాఫ్ మీద బాబు కోటి ఆశలు పెట్టుకున్నారని విశ్లేషణలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: