``సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేవు. భయాలు వద్దు..అనవసర బుకింగులు చేయొద్దు. సమయానికే మీ వద్దకు చేరుస్తాం`` అంటూ సిలిండర్ల స‌ర‌ఫ‌రా డీల‌ర్లు, ప్ర‌భుత్వ అధికారులు క్లారిటీ ఇచ్చిన ఒక‌ట్రెండు రోజుల్లోనే ఊహించ‌ని షాక్ తెర‌మీద‌కు వ‌చ్చింది. వంట గ్యాస్‌ సిలిండర్లకు అనూహ్యంగా డిమాండు పెరగటంతో గ్యాస్‌ కంపెనీలు ఆంక్షలు విధించాయి. బుక్‌ చేసిన సిలిండరు డెలివరీ అయిన 14 రోజుల తరవాత మాత్రమే మరో దానిని బుక్‌ చేసుకునేలా గ్యాస్‌ కంపెనీలు నిర్ణయించాయి.

 


కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించటంతో ప్రజలు ముందు జాగ్రత్తగా సిలిండర్లు బుక్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగితే.. కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో అవసరం లేకున్నా ముందస్తుగానే బుక్‌ చేసుకుంటున్నారు.. ఆ తర్వాత ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముందస్తుగా ఒక సిలిండర్‌ను అందుబాటులో ఉంచుకుంటున్నారు ప్రజలు.  ప్రస్తుతం వంటగ్యాస్‌ వినియోగం రెండు లక్షలు దాటుతున్నట్లు తెలిసింది. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్‌ కనెక్షన్‌ పొందిన వారికి మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని కేంద్రం ప్రకటించటంతో వారు కూడా సిలిండర్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. 

 

ఇలా లక్షల్లో బుకింగ్స్‌ వస్తుండటంతో.. 14 రోజుల నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు. భారత్‌, హెచ్‌పీ గ్యాస్‌ కంపెనీలు ఈ నిబంధనను అమలు చేయగా.. ఇండేన్‌ కంపెనీ సైతం ఇదే బాట‌లో సాగింది. ఇప్పటి వరకు సిలిండరు వచ్చిన 24 గంటల తరవాత మరొకటి నమోదు చేసుకోవచ్చు. కాగా, కరోనా నియంత్రణ నేపథ్యంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి నేపథ్యంలోనూ  ఎమర్జెన్సీ సర్వీసుల కింద వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ వంటి నిత్యావసరాలు అందుతాయని, అవసరం ఉంటేనే సిలిండర్లు బుక్‌ చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. వంటగ్యాస్‌ సరఫరాకు ఢోకా ఏర్పడదని తెలిపారు.  సోషల్‌ డిస్టెన్స్‌లో భాగంగా కాలనీలు, అపార్ట్‌మెంట్‌ వాసులు, గేటెడ్‌ కమ్యూనిటీ వర్గాలు డెలివరీ బాయ్స్‌కు సహకరించాలని చెబుతున్నారు. మెయిన్‌గేట్‌ వద్ద సిలిండర్‌ ఇస్తే ఎవరికీ వారు తీసుకువెళ్లాలని, సీనియర్‌ సిటిజన్లకు సంబంధిత నివాసితులే అందజేయాలని ప్రతిపాదనలు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: