కరోనా వైరస్ మూడు దశల్లో విస్తరిస్తుందని వైద్య  నిపుణులు చెబుతున్నారు . అయితే భారత్ లో  కరోనా వైరస్ వ్యాప్తి  రెండవ దశ లో ఉందని చెబుతున్నప్పటికీ , ఇప్పటికే మూడవ దశ కు చేరుకున్నట్లు  నిపుణులు అంచనా వేస్తున్నారు . ఈ దశ లో వ్యాధి నియంత్రణ చాల కష్ట సాధ్యమని పేర్కొంటున్నారు . తొలిదశలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వల్ల కరోనా వ్యాధి వ్యాప్తి చెందగా , రెండవ దశలో వారితో కాంటాక్ట్ అయిన వారికి వ్యాధి సంక్రమిస్తుందని, ఇక  మూడవ దశలో సామూహికంగా వ్యాప్తి చెందుతుందని , ఈ దశలో ఎవరి నుంచి వ్యాధి వ్యాప్తి చెందింది... ఎంతమందికి కరోనా సోకింది అన్నది కనిపెట్టడం కష్టమని అంటున్నారు .

 

మూడవ దశలో అప్రమత్తంగా లేకపోతే భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించే అవకాశముందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు . రానున్న ఐదు  నుంచి 10 రోజులు చాల కీలకమని , ఇప్పటి వరకు లక్షణాలు బయటపడని వారివద్ద కూడా బయటపడే అవకాశాలున్నాయని అంటున్నారు .  అయితే కరోనా కట్టడికి లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణపై దృష్టి సారించాయే తప్పా, అవసరమైన ఆసుపత్రులు , తర్ఫీదు పొందిన వైద్య సిబ్బందిని సమకూర్చుకోవడం లో ఘోరంగా విఫలమయ్యాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి . దేశ వ్యాప్తంగా సరిపడా టెస్టింగ్ కిట్స్ కూడా సమకూర్చుకునే ప్రయత్నం చేయలేదని అంటున్నారు .

 

జలుబు , దగ్గు , శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉన్నవారికి మాత్రమే కరోనా టెస్టు చేస్తున్నారని , ఈ మూడు లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్న వారికి కిట్స్ అయిపోతాయనే ఉద్దేశ్యం తో టెస్టులు నిర్వహించడం లేదని అంటున్నారు . ఆ పరిస్థితి మారకపోతే , అసలు కరోనా ఎంతమందికి సోకిందన్నదానిపై ఒక అంచనాకు రాలేమని చెబుతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: