కరోనాకు కజిన్ సిస్టర్ మద్యం అని చెప్పవచ్చు.. ఇలా తాగుడుకు అలవాటుపడిన వారికి కరోనా ఒక లెక్కకాదు.. సమయానికి గొంతులోకి చుక్కపడకుంటే వారికి పగలే చుక్కలు కనిపిస్తాయి.. ఇక పూర్తిగా మద్యానికి గానీ, కల్లుకు గానీ బానిసలైన వారికి.. రాజులు, గుర్రాలు, సైనికులు కూడా ఉంటారు.. వీరంత ఏరి అంటూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు.. ఇకపోతే కరోనా నేపధ్యంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించగా అన్ని దుకాణాలు కూడా బందు చేయగా, అందులో మద్యం దుకాణాలకు కూడా కష్టాలు వచ్చాయి.. మద్యం దుకాణాలతో పాటుగా మందు బాబులకు కూడా ఎక్కడలేని కష్టం మొదలైంది..

 

 

ఇక మద్యం బానిసత్వం ఒకవైపైతే, కల్తీ కల్లు కు బానిసగా మారిన వారికి సమయానికి దొరక్కపోతే పిచ్చివాళ్లలా మారి ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇలా నిజామాబాద్ జిల్లాలో సమయానికి కల్లు దొరక్కపోవడంతో శనివారం ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఒక వీరే కాదు జిల్లాలో చాలామంది కల్లు దొరకడం లేదని వింత చేష్టలతో తిండి మానేసి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

 

 

కాగా ఈ పిచ్చి మందుబాబుల్లో నిజామాబాద్‌లోని గాయత్రీ నగర్‌కు చెందిన శంకర్‌ (45) అనే మందుబాబు శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇక వింత ప్రవర్తనతో సాయినగర్‌కు చెందిన శకుంతల(60) శుక్రవారం రాత్రి ఫినాయిల్‌ తాగేసింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కల్లు దొరక్కపోవడంతో మూడ్రోజులుగా పిచ్చిపట్టిన దానిలా ప్రవర్తించినట్లు ఈమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కల్లు అనుకొనే ఫినాయిల్‌ తాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

 

వీరిద్దరే కాకుండా నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో శనివారం, ముదిరాజ్‌ వీధికి చెందిన మరో వ్యక్తి(50) మూర్ఛతో మృతి చెందాడు. అయితే తనికి కూడా సమయానికి కల్లు దొరక్కపోవడం వల్లే రెండ్రోజుల కిందట మూర్ఛ రాగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగానే మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక రసాయనాలు కలిపిన కల్లుకు బానిసలైన ఎంతో మంది లాక్‌డౌన్‌లో కల్లు దొరక్క వింతగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: