భార‌త్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.. అదేమిటీ.. ప్ర‌ధాని క్ష‌మాప‌ణ‌లు ఎందుకు చెప్పార‌ని అన‌కుంటున్నారా..?  మీరు చ‌దువుతున్నది నిజ‌మే.. భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆదివారం ఉద‌యం 11గంట‌ల‌కు మ‌న్‌కీబాత్ నిర్వ‌హించారు. క‌రోనా వ్యాప్తి నిరోధానికి దేశ‌వ్యాప్తంగా ఏప్రిల్ 14వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయ‌ని, ఇందుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని మోడీ అన్నారు. కానీ.. క‌రోనా వైర‌స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునేందుకు విధించుకున్న ల‌క్ష్మ‌ణ్ రేఖ అని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌లు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటించి, క‌రోనా క‌ట్ట‌డికి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. ఈ సంద‌ర్భంగా క‌రోనా నుంచి కోలుకున్న ప‌లువురితో ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ మాట్లాడారు. వారి అనుభ‌వాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ.. త‌మ‌కు క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే ఎంతో భ‌య‌మేసింద‌ని, కానీ.. వైద్యులు త‌మ‌కు ఎంతో ధైర్యం చెప్పార‌ని, నాణ్య‌మైన వైద్య‌సేవలు అందించార‌ని మోడీకి వివ‌రించారు. అందుకే తాము తొంద‌ర‌గా కోలుకున్నామ‌ని చెప్పారు.

 

అలాగే.. వైద్యుల‌తో కూడా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వైద్యుల అనుభ‌వాన్ని కూడా ఆయ‌న తెలుసుకున్నారు. అనంత‌రం మోడీ మాట్లాడుతూ.. క‌రోనా వ్యాప్తి నిరోధానికి వైద్యులు, వైద్య‌సిబ్బంది, ఆశ కార్య‌క‌ర్త‌లు చేస్తున్న కృష్టిని మెచ్చుకున్నారు. ప్రాణాల‌కు తెగించి, వైద్యుల‌కు క‌రోనా బాధితుల‌కు సేవ‌లు అందిస్తున్నార‌ని ప్ర‌ధాని మోడీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నిరంత‌రం పారిశుధ్య‌సేవ‌లు అందిస్తూ దేశాన్ని శుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికుల‌ను రియ‌ల్ హీరోలుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. క‌ష్ట‌కాలంలో  ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న వారంద‌రినీ ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ అభినందించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి ప్ర‌జ‌లంద‌రూ ఇలాగే ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాల‌ని, అప్పుడే మ‌న‌ల్ని మ‌నం కరోనా బారి నుంచి కాపాడుకోవ‌చ్చున‌ని ఆయ‌న సూచించారు. ఇబ్బందులు క‌లుగుతున్నా.. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ప్ర‌జ‌లు పాటించాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌జ‌లు స్వీయ‌నియంత్ర‌ణ,  సామాజిక దూరం పాటించాల‌ని ప్ర‌ధాని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: