దేశంలో క‌రోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌లు కీల‌క విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆదివారం ఉద‌యం 11గంట‌ల‌కు ఆయ‌న మ‌న్‌కీబాత్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌నీ, కానీ క‌రోనా క‌ట్ట‌డికి ఇంత‌కుమించిన మార్గం త‌న‌కు క‌నిపించ‌లేదని, మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌డానికి గీచుకున్న ల‌క్ష్మ‌ణ రేఖ అని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఇత‌ర దేశాల్లాగా మ‌నం క‌రోనా బారిన ప‌డొద్ద‌న్న ఉద్దేశంతోనే ఇంతటి క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న క్ష‌మాఫ‌ణ‌లు చెప్పారు. ఇందుకు ప్ర‌జ‌లు కూడా పూర్తి స్థాయిలో స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఇదే సంద‌ర్భంగా క‌రోనా క‌ట్ట‌డికి ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశారు. సోష‌ల్ డిస్టెన్స్ పెంచండి,  ఎమోష‌న‌ల్ డిస్టెన్స్ త‌గ్గించండి.. అంటూ ఆయ‌న పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ నిబంధ‌ల‌ను పాటించాల‌ని, ఎలాంటి ఆందోళ‌న‌కు గురికావొద్ద‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.

 


 ఈ రెండు అంశాల‌ను పాటిస్తే మ‌నం క‌రోనా మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధించిన‌ట్టేన‌ని ప్ర‌ధాని మోడీ చెప్పారు. క‌రోనా క‌ట్ట‌డికి మ‌నంద‌రం క‌లిసి పోరాటం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని స్తంభింప‌జేసింద‌ని, అన్నివ‌ర్గాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంద‌ని, పిల్ల‌లు, పెద్ద‌లు యువ‌త‌, ఉన్న‌వాళ్లు, లేనివాళ్ల‌ను.. ఇలా అంద‌రినీ ప్ర‌భావితం చేస్తోంద‌ని, దీనిపై అంద‌రం క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాల్సిన అవ‌సరం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ఇక ఈ సంద‌ర్భంగా క‌రోనా బారి నుంచి కోలుకున్న ప‌లువురితో ప్ర‌ధాని మోడీ మాట్లాడారు. వారి అనుభ‌వాల‌ను తెలుసుకున్నారు. క‌రోనా పేషెంట్ల‌కు సేవ‌లు అందిస్తున్న వైద్యుల‌తో కూడా ఆయ‌న మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు.. త‌దిత‌ర విభాగాల సిబ్బందిని అభినందించారు. ఆప‌ద‌లో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్నార‌ని కొనియాడారు. అంతేగాకుండా.. క్వారంటైన్ స‌మ‌యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌ధాని మోడీ సూచించారు. ఈ మ‌హ‌మ్మారిపై మ‌నం క‌చ్చితంగా విజ‌యం సాధిస్తామ‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: