కరోనా కొందరికి ప్రాణభయాన్ని కలిగిస్తుంటే మరి కొందరికి మాత్రం వెకిలి చేష్టల ఆటలా ఉంది.. ఇప్పటికే మానసిక స్దైర్యాన్ని కోల్పోయి జీవచ్చంలా బ్రతుకుతున్న వారి పాలిట నకిలీగాళ్లు మోపై ఆగమాగం చేస్తున్నారు.. అరే ఏమైనా బుద్ధి ఉందా.. ఒక విషయం పై పూర్తి అవగహన లేకుండా కంటికి కనిపించిన చిన్న పదాన్ని పట్టుకుని సోదంతా సమకూర్చి, సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ ఇస్తే.. గుండె వీక్‌గా ఉన్నవాళ్లు ఆ గుండే ఆగి చావరా.. ఇలాంటి నకిలీ వార్తలు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్నాయి..

 

 

ఇకపోతే దేశమంతా లాక్ డౌన్ వేళ మందుబాబులు చుక్క లేక అల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో చుక్కలేనిదే బుక్క దిగని మందుబాబులు అల్లోకల్లోలం అవుతున్నారు.. ఇంతే గాక చుక్క దిగకపోవడంతో తట్టుకోలేని ఇద్దరు వ్యక్తులు ఫిట్స్‌తో చనిపోయారు. కాగా ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఓ తప్పుడు వార్త చక్కర్లు కొట్టింది. అదేమంటే మందుబాబుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం నుంచి కొద్ది సేపు వైన్స్‌ను కూడా తెరుస్తారనేది ఆ నకిలీ జీవో సారాంశం. దీనిని కొందరు ఆకతాయిలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని తెలిసింది..

 

 

ఇక ఎక్సైజ్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై, ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ రాజేంద్ర హైదరాబాద్ సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. కర్ఫ్యూలో భాగంగా వైన్స్ షాపులు మూసి ఉండటంతో... డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పేరుతో రోజూ మూడున్నర గంటలు వైన్స్ తెరుస్తున్నట్లు నకిలీ ప్రభుత్వ జీవోను సర్క్యులేట్ చేశారని ఈ సందర్భంగా తెలిపారు.

 

 

అంతే కాకుండా ఆ జీవోకు ఎక్సైజ్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని... ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరగా, కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ ఈ నకిలీ జీవోను వైరల్ చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.. ఏది ఏమైనా ఈ సమయంలో మందుబాబులకు అమృతం లాంటి వార్తను నకిలీ వార్తగా ప్రచారం చేసి, వారి ఆశల మీద నీరుజల్లి, ఆడుకుంటున్న, నకిలీ కేటుగాళ్ల తోలు ఊడగొట్టడానికి సిద్దమైయ్యారట ఖాకీ యూనిఫాం వేసుకున్న అధికారులు..

మరింత సమాచారం తెలుసుకోండి: