ప్రధానమంత్రి న‌రేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మన్‌ కీ బాత్ ద్వారా ఇచ్చిన‌ సందేశంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్‌ నియమాలు పాటించకపోతే కరోనా వైరస్‌ డేంజర్‌ నుంచి మనల్ని కాపాడుకోవడం చాలా కష్టతరమైతదని పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించాల్సిందిగా ప్రధాని మరోమారు కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా పేద ప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నానని ఆయ‌న తెలిపారు. వ‌లస కూలీల‌కు ఇబ్బందులు క‌లుగుతున్న విష‌యం త‌న‌కు తెలుసున‌ని ఆయ‌న చెప్పారు. అయితే, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం త‌న రాష్ట్రంలో అలాంటి స‌మ‌స్య‌లు ఎదురుకాకుండా వీలైనంత వ‌ర‌కు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. 

 


లాక్‌డౌన్‌ కారణంగా రాకపోకలు నిలిచిపోవడం, కొన్ని రకాల నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడడంతో  తెలంగాణ రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగంపై ఆధార‌ప‌డి ఉన్న వారికి ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను మాన‌వ‌తా దృక్ప‌థంతో ప‌రిష్క‌రిస్తున్నారు. భ‌వ‌న నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రీల దగ్గర్నుంచి మార్బుల్స్‌, టైల్స్‌ పనులు, కార్పెంటర్స్‌, ఫ్యాబ్రికేషన్‌ వర్క్స్‌, ప్లంబర్స్‌, పెయింటింగ్‌, మట్టి పని చేసే వారు ఇలా అనేక మంది ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఒడిశా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ర్టాల వారు ప్రముఖంగా ఉన్నారు. నిర్మాణ రంగంలోని కూలీలను ఆదుకోవాలని ఇటీవల మంత్రి కేటీఆర్‌ అటు నిర్మాణదారులకు, ఇటు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు బిల్డర్లందరినీ సమన్వయం చేసి వారి సైట్ల వద్దే లేబర్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కార్మికులకు ఉచితంగా భోజనం, ఇతర కనీస సౌకర్యాలను సమకూర్చే విధంగా తగిన ఏర్పాట్లు చేశారు. 

 

మొత్తంగా వివిధ రకాల విధులు నిర్వహించే మేస్త్రీలు, కూలీల సంక్షేమం కోసం బిల్డర్లు, వివిధ ఏజెన్సీల ఆధ్వర్యంలో నగరంలోని 168 ప్రాంతాల్లో లేబర్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆయా ఏజెన్సీలు నిర్మాణం చేస్తున్న భవనాలు, సైట్ల వద్దే వీటిని ఏర్పాటు చేసి భోజనం, ఇతర కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. 25వేలకుపైగా మేస్త్రీలు, కూలీలు వీటిల్లో ఉండగా, వీరికి కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు. దీంతో కూలీల‌కు సేవ‌లు అందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: