తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ రైతుల‌కు ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి చేశారు. చ‌రిత్ర‌లో ఏనాడు లేన‌టువంటి ప‌రిస్థితి ఎదుర్కుంటున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అన్న‌దాత‌లు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించ‌డం అవ‌స‌ర‌మ‌ని ఆయన పేర్కొంటూనే భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన మాట‌లు నిజ‌మై...ఆయ‌న ఆదేశాలు ఫ‌లిస్తే...అధికారులు అమ‌లు చేస్తే...రైతులు స‌హ‌క‌రిస్తే నిజంగానే ఏ స‌మ‌స్య‌లు ఎదురుకావ‌ని ప‌లువురు అంటున్నారు. ఇదంతా వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల గురించే.

 


విలేక‌రుల స‌మావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పంట కొనుగోలు కోసం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 25 వేల కోట్లు సమకూర్చామ‌ని తెలిపారు. మ‌రే  రాష్ట్రంలోనూ ఇటువంటి ఏర్పాట్లు లేవని ఆయ‌న పేర్కొన్నారు. ``ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పంట పండుతుంది. 40 లక్షల ఎకరాల్లో వరి పంట, 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో కోటి 5 లక్షల టన్నుల వరి దిగుబడి వస్తుంది.  రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందర పడకూడదు. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు.. అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. రూ.3,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు హామీ ఇచ్చాం. మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది` ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. 

 

క్రమప‌ద్ధతిలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. `` నెలా 15 రోజుల పాటు ధాన్యం కొనుగోలు చేస్తాం. కూపన్‌లు ఇచ్చి దాని ప్రకారమే కొనుగోలు చేస్తాం.  కూపన్‌ల పంపిణీ కోసం అగ్రికల్చర్‌ ఆఫీసర్స్‌ది ప్రధాన పాత్ర.   ఇప్పటికే సమీక్ష జరిపి బాధ్యతలు అప్పగించాం.  కూపన్లలో ఉన్న తేదీల ప్రకారమే విక్రయాలు జరుగుతాయి. డబ్బులన్ని ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేస్తాం. రైతులు సహకరించాలని కోరుతున్నాం. అనవసరంగా కొనుగోలు కేంద్రం వద్దకు రావద్దు.`` అని కేసీఆర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: