ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలను సమర్థంగా నిర్వహించాలని పురపాలక శాఖ కమిషనర్లను, అధికారులను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.  క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ, మార్కెట్లలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణతోపాటు, అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ అమలు, మొబైల్ రైతు బజార్లు, వలస కూలీల సమస్యలు తదితర అంశాలపై పురపాలక శాఖ ఉన్నతాధికారులతో కలిసి పురపాలక శాఖ కమిషనర్లతో సిఆర్ డిఎ కార్యాలయం నుంచి  వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  గారి నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అనుగుణంగా రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలు, ఇకపై అమలు చేయాల్సిన కార్యాచరణపై కమిషనర్లకు స్పష్టమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. 

 

వివిధ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య స్థితిగతుల సమాచారంతో పాటు, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ సూచించారు. అంతే కాకుండా పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లోని ప్రజల్లో అవగాహన పెంచాలని, ఇందు కోసం స్వయం సహాయక బృందాల సహాయ సహకారాలను తీసుకోవాలని సూచించారు.కోవిడ్ కు సంబంధించిన సమాచారం నిమిత్తం ప్రతిచోటా ప్రత్యేకంగా కంట్రోల్ రూం లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో సిఆర్ డిఎలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 

వార్డు వాలంటీర్లు, సెక్రటేరియట్ ల  నుంచి ఎప్పటికప్పుడు నిర్దేశిత నమూనాలో సమాచారాన్ని తెప్పించుకోవాలని, వాటిలోని అంశాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో ఎంతమంది క్వారంటైన్ లేదా స్వీయ నిర్బంధంలో   ఉన్నారు,  ఇంకా ఎంతమంది ఈ విధంగా నిర్చంధంలోకి రావాల్సి ఉంది వంటి అంశాలతో పాటు, ఇలాంటి వారు వారి బయట తిరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై మంత్రి కమిషనర్లతో సమీక్షించారు. పట్టణం ప్రాంతం లో నివాసం ఉంటున్న ప్రజలను ప్రతిరోజూ పరిశీలన చేయిస్తామని, ఎక్కడెక్కడ ఏవిధంగా తేడాలు ఉన్నాయో నివేదిక సిద్దం‌ చేస్తామన్నారు. ఇంటింటి సర్వే లో టీచర్లు కూడా భాగస్వామ్యం కావాలని కోరనున్నామనీ, ఇందుకు సంబంధించి సోమవారం ఒక సమావేశం నిర్వహిస్తున్నామని  తెలిపారు. 

 

అలాగే పారిశుద్ధ్య నిర్వహణ చర్యల్లో భాగంగా పంపిణీ అవుతున్న మాస్కుల నాణ్యతతో పాటు, అవసరమైన మేర సోడియం హైపో క్లోరైట్, బ్లీచింగ్ పౌడర్ ల వంటివి ఉన్నాయా లేదా అన్న వాటిపై మంత్రి ఆరా తీశారు. అలాగే పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న వారికి రవాణా సదుపాయాల వంటి వాటిపై కూడా మంత్రి వాకబు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: