తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై కరోనా ప్రభావం  తీవ్రంగానే ఉండనుందా?, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుందనేది హాట్ టాఫిక్ గా మారింది .   కరోనా విస్తృతిని  కట్టడి చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం  లాక్ డౌన్ ప్రకటించడానికంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం  లాక్ డౌన్ ప్రకటించిన విషయం  తెల్సిందే . దీనితో వివిధ మార్గాల ద్వారా  రాష్ట్ర ప్రభుత్వానికి  వచ్చే అన్ని రకాల పన్నులను నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది . కేంద్రం నుంచి వచ్చే పన్నులు కూడా ఇప్పుడప్పుడే  వచ్చే సూచనలు లేకపోవడంతో ,  ఆర్ధికభారాన్ని అధిగమించేందుకు శాసనసభ్యులు , మండలి సభ్యులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించే అవకాశం లేకపోలేదని  కేసీఆర్ సూచన ప్రాయంగా వెల్లడించారు .

 

కేంద్రం నుంచి దాదాపు 12 వేలకోట్ల రూపాయలకు  పైచిలుకు పన్నుల రూపం లో రావాల్సి ఉందన్న ఆయన ,  ఇది విపత్కర సమయమని  సౌకర్యాలను కోరుకోవడం సరికాదని, బాధ్యతలను పంచుకోవాలని  చెప్పారు  .  ఈ విపత్కర సమయం లో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా సంక్షేమం దృష్ట్యా  విరివిగా  నిధులు ఖర్చు చేయాల్సి రావడం , దానికి తగ్గట్లుగా ఆదాయ వనరులు లేకపోవడం తో ఖర్చులను తగ్గించుకుని పొదుపు మంత్రాన్ని జపించాల్సిందేనని ఆర్ధిక రంగ  నిపుణులు సైతం   సూచిస్తున్నారు  . పొదుపు మంత్రాన్ని జపించడమే కాకుండా , అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని అప్పుడే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గాడిలో పడే అవకాశముందని పేర్కొంటున్నారు .

 

అయితే ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా కొత్త కేసులు నమోదు కాకపోతే వచ్చేనెల ఏడవ తేదీనాటికి తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరించే అవకాశాలున్నాయి . అదే జరిగితే మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోలేదని ఆర్థికరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు . అలాకాకపోతే మాత్రం మరిన్ని ఆర్ధిక ఇబ్బందులు తప్పకపోవచ్చునని అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: