క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో హైద‌రాబాద్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. ఓ వైపు మాన‌వ‌తా దృక్ప‌థంతో చ‌ర్య‌లు చేప‌డుతూనే మ‌రోవైపు క‌ఠిన చ‌ర్య‌లు కూడా తీసుకుంటోంది. స‌ర్కారు ఆదేశాల‌ను ఉన్న‌తాధికారులు స్ప‌ష్టంగా పాటిస్తున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చిన కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చిన దాదాపు 200మందికి బాలాపూర్‌ తదితర ప్రాంతాల్లో వసతిగృహాలను స్వచ్ఛంద సంస్థల సహకారంలో ఏర్పాటు చేశారు. ఒడిశా, బీహార్‌కు చెం దిన కార్మికులు కూడా ఆందోళనకు గురికాకుండా ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉంటే వారికీ నిత్యావసర సరుకులు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

 

మ‌రోవైపు  హైద‌రాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైదరాబాద్‌లోని ఏ ప్రాంతాన్ని కూడా రెడ్‌ జోన్‌గా ప్రకటించలేదని స్పష్టం చేశారు. ఫిలింనగర్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, రెడ్‌జోన్‌గా ప్రకటించారంటూ మార్ఫింగ్‌ చేసిన ఫ్లెక్సీలను సోషల్‌మీడియా, వెబ్‌సైట్లలో పోస్టు చేయడంపై దుమారం చెలరేగింది. దీనిపై స్పందించిన కలెక్టర్‌.. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తే సహించేదిలేదని, బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ సూచనలను పాటిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

 

 

 రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 1,989 మంది కరోనా అనుమానితులను గుర్తించగా,  1,740 మందిని వ్యక్తిగతంగా పరిశీలించామని సీపీ మహేశ్‌భగవత్‌ తెలిపారు. ఇందులో ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని, మిగతా 1,664 మంది క్వారంటైన్‌లో ఉన్నారని సీపీ వివరించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు 29 క్రిమినల్‌, 36 పెట్టీ కేసులు పెట్టామని, 33 ద్విచక్రవాహనాలు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన 800 మంది పాస్‌పోర్టులను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఎవరికైనా అత్యవసరమైనప్పుడు పోలీసుల సహకారం కోసం కరోనా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 9490 617234కు సమాచారం అందించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: