ఢిల్లీ లో ఇటీవల జరిగిన ఒక మత సభకు వెళ్లి వచ్చిన వారిలో చాలామందిని అధికారులు  కరోనా బాధితులుగా  గుర్తించారు  . దీనితో సదరు సభకు హాజరయి వచ్చిన వారిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు  ప్రత్యేకంగా దృష్టి సారించాయి . ఇక  తెలంగాణలో మృతి చెందిన తొలి కరోనా బాధితుడు కూడా ఆ  సభకు వెళ్ళివచ్చినట్లు అధికారులు వెల్లడించారు . తెలంగాణ నుంచి అతనితోపాటు ఇంకా ఎంతమంది ఈ సభకు హాజరయ్యారన్నదానిపై అధికారులు ఆరా తీసే పని లో నిమగ్నమయ్యారు .  ఇక   ఈ మత సభ కు దేశ వ్యాప్తంగా వేలాది మంది హాజరయినట్లు తెలుస్తోంది .

 

 అయితే వీరంతా రైళ్లలోనే ప్రయాణం చేసినట్లుగా అధికారులు గుర్తించారు . దేశ రాజధాని నుంచి వివిధ ప్రాంతాలకు రైలులో  చేరుకోవడానికి  దాదాపు 12 నుంచి  36 గంటల వరకు  సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు .  ఈ లెక్కన వీరిలో కొంతమంది  36 గంటలపాటు, ఇతరులతో కలిసి  సామూహిక ప్రయాణాలు చేశారన్న వార్తే ఇప్పుడు అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది .  కరోనా బాధితుని తో కలిసి ప్రయాణం చేసిన వారిలో చాలామందికి ఈ వ్యాధి సోకే అవకాశముండడం అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది .    సదరు మతసభకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా బాధితులయిన వ్యక్తులతో  కలిసి , ఎంతమంది ఆ రోజు  రైలు ప్రయాణం చేశారన్నది అంతుచిక్కని మిస్టరీ గా మారింది .

 

మతసభకు వెళ్లివచ్చిన వారిలో  ఎంతమంది  కరోనా బాధితులో తెలుసుకునే ప్రయత్నాన్ని  అధికారులు చేస్తున్నారు . ఆ తరువాత వారు ప్రయాణించిన రైళ్ల వివరాలను తెలుసుకుని , ఆ రోజు ప్రయాణించిన వారి వివరాలు సేకరించవచ్చునని భావిస్తున్నారు . ఇక సదరు సభ కు వెళ్లి వచ్చిన  వారి ఆరోగ్య పరిస్థితిపై గురించి అధికారులు వాకబు చేస్తున్నారు    . ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్ గా తేలిన వారికి చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: