హెరాల్డ్ విజేతల జాబితాలో చెప్పుకోవాల్సిన రాజకీయ నేతల్లో చంద్రబాబునాయుడును ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నిరుపేద రైతు కుటుంబంలో జన్మించి మూడుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించటమంటే మామూలు విషయం కాదు. ఒకానొక దశలో జాతీయ రాజకీయాలను కూడా శాసించాడనే ప్రచారం జరగిందంటే మామూలు విషయం కాదు. యోధానుయోధులైన ఎందరో నేతలు ఉత్తర భారత దేశంలో  ఉన్నా ఓ దశలో వారందరినీ కాదని చంద్రబాబు మాటే  కేంద్రంలో చెల్లుబాటైందన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే.

 

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో మారుమూల పల్లె నారావారిపల్లెలో చంద్రబాబు పుట్టారు. ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మలకు పుట్టిన ఇద్దరు కొడుకుల్లో చంద్రబాబు పెద్దవాడు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ వరకు చంద్రగిరిలోనే చదివినా తర్వాత తిరుపతికి మారాడు. డిగ్రీ అయిపోగానే శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటిలో ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. యూనివర్సిటిలో చేరిన తర్వాతే యూత్ కాంగ్రెస్ రాజకీయాల వైపు చంద్రబాబుకు గాలి మళ్ళిందని అంటారు. పైగా యూనివర్సిటిలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ డిఎల్ నారాయణ మద్దతు కూడా సంపూర్ణంగా దొరికింది. ఆర్ధికంగాను, రాజకీయంగా ప్రొఫెసర్ అందించిన మద్దతుతోనే స్పీడుగానే  విద్యార్ధి రాజకీయాల్లో ఎదిగాడు.

 

ఎంఏ అయిపోయే సమయానికి అంటే 1978లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి తరపున మొదటిసారి అసెంబ్లీకి పోటి చేసి గెలిచాడు. అదృష్టంతో వెంటనే మంత్రి కూడా అయిపోయాడు. అదే పమయంలో సినిమా రంగంలో బ్రహ్మాండంగా వెలుగుతున్న నందమూరి తారకరామారావు కూతురు భువనేశ్వరితో వివాహం కూడా అయ్యింది. చంద్రబాబు భవిష్యత్ రాజకీయాలకు ఎన్టీయార్ కు అల్లడవ్వటంతోనే భీజం పడిందనే చెప్పాలి.

 

ఎలాగంటే 1982లో ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీని పెట్టడం, చంద్రబాబు మామగారితో విభేదించి కాంగ్రెస్ తరపునే 1983లో చంద్రగిరిలో పోటి చేసి చిత్తుగా ఓడిపోవటం, తర్వాత టిడిపిలో చేరటం అందరికీ తెలిసిందే. 1984 ఎన్టీయార్ వెన్నుపోటు తర్వాత 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో పోటి చేయకుండా పార్టీ కార్యక్రమాలకే పరిమితమైపోయాడు. తర్వాత 1989లో చంద్రగిరిలో లాభం లేదని భావించి జిల్లాలో మారుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్ళాడు. 1989లో మొదటిసారి కుప్పంలో పోటి చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకూ తిరుగులేకుండా గెలుస్తునే ఉన్నాడు.

 

ఒకే నియోజకవర్గం నుండి వరుసగా ఆరుసార్లు ఓటమన్నదే లేకుండా గెలవటమంటే మామూలు విషయం కాదు. రాజకీయ రణతంత్రంలో ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో చంద్రబాబు ఆరితేరిపోయాడనే చెప్పాలి.  చంద్రబాబులో గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రత్యర్ధిని నేరుగా ఎదుర్కోవటంలో ధైర్యం లేదు. ప్రత్యర్ధి బలహీనతే తన బలంగా చేసుకుని రాజకీయాలు చేయటంలో దిట్టనే చెప్పుకోవాలి. ఫార్టీ ఇయర్స్ గా ఇండస్ట్రీలో ఇదే పద్దతిలో నెట్టుకొచ్చేస్తున్నాడు.

 

1995లో మొదటిసారి సిఎం అయ్యాడు. రెండోసారి 1999లో, 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అవ్వటమంటే మామూలు విషయం కాదు. అలాగే పదిహేనేళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం కూడా బహుశా రికార్డేనేమో ? ఏదేమైనా అక్కడక్కడ ఎదురుదెబ్బలు తిన్నా మొత్తం మీద చంద్రబాబును విజేతగానే చెప్పుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: