వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు పూర్తవుతోంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జగన్ నిర్ణయాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్తున్నట్లు గా కనిపిస్తున్నా తెరవెనుక మాత్రం అనేక ఇబ్బందులను వైఎస్ఆర్సిపి ఎదుర్కొంటోంది. ఒకవైపు రాజకీయ ప్రత్యర్ధులు వైసీపీ పై బురద చల్లేందుకు కాచుకొని కూర్చున్నారు. ప్రభుత్వ నిర్ణయంలో ఏదైనా చిన్న లోపం కనిపిస్తే దాని ఆధారంగా ప్రజల్లోకి వెళుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో జగన్ చాలా వరకు కట్టడి చేసుకున్నా.. సొంత పార్టీ నేతల వ్యవహార శైలిపై ఇప్పుడు జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

IHG


ఎన్నికలకు ముందు వైసీపీ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారు. అయితే వారిలో చాలామందికి సీట్లు దక్కలేదు.అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు ఇంకా అనేక పదవులు ఇస్తామని వైసీపీ తరఫున వారికి హామీలు ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతున్న వీరిలో చాలామందికి మాత్రం పదవులు దక్కలేదు. దీంతో వారిలో చాలామంది నాయకులు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చాలాచోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. అయితే పార్టీపై అసంతృప్తితో ఉన్న నియోజకవర్గ స్థాయి నాయకులు చాలామంది పార్టీ అభ్యర్థులు ఓటమి కి కృషి చేశారనే విషయం ఇప్పుడు జగన్ వరకు వెళ్ళింది.


 అంతే కాకుండా ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు తదితర చోట్ల సొంత పార్టీ నాయకులే ఆధిపత్య పోరుతో పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నించారనే విషయం జగన్ గుర్తించారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారందరికి ఇప్పటికే గట్టి వార్నింగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతానికి చెందిన ఓ మంత్రి సొంత పార్టీ అభ్యర్థులు ఓటమికి కృషి చేయడంతో పాటు జనసేన పార్టీ అభ్యర్థులు  గెలిచేందుకు కృషి చేసినట్లుగా జగన్ కు నివేదికలు అందాయి. అలాగే ఇదే డెల్టా ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇంచార్జి గా ఉన్న ఓ స్థానికేతరుడి ప్రాబల్యం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. 


ఇదే విషయమై వై వి సుబ్బారెడ్డి సైతం సదరు నాయకుడికి వార్నింగ్ ఇచ్చినా ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా క్షణం తీరిక లేకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ ఈ వ్యవహారం సద్దుమణిగిన తరువాత వెన్నుపోటు వీరుల పై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: