కరోనా వ్యాధి కట్టడి కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యం లో  ప్రజా ప్రజానిధులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు . ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లోనే  , మంత్రులు జిల్లా హెడ్ క్వార్ట్రర్ లో ఉండాలని ఆదేశించారు . ఇక జిహెచ్ఎంసి కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలోని ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించాలని, నిత్యవసరాల కోసం రోడ్ల పైకి వచ్చే వారు సామాజిక దూరం పాటించేలా చూడాలని ఆదేశించారు . ఇక ప్రతీ గ్రామం లో సర్పంచ్ , ఎంపిటిసి , మండలం లో మండలాధ్యక్షుడు , జెడ్పిటిసి కీలకంగా వ్యవహరించాలని ఆదేశించారో , లేదో అందరూ రంగంలోకి దిగి కరోనా పై పోరాటానికి సిద్ధపడ్డారు .

 

ప్రధానంగా జిహెచ్ఎంసి పరిధిలోని అధికార పార్టీ కార్పొరేటర్లు పోటీ పడి కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాన్ని  చేస్తున్నారు . త్వరలోనే జిహెచ్ఎంసి ఎన్నికలు జరగనున్న నేపధ్యం లో అధినేత,  ఆదేశాలు పాటించకపోతే ఎక్కడ టికెట్ దక్కదేమోనని , నిత్యం  ప్రజల్లో  ఉంటూ, అధినేతను ఆకట్టుకునే ప్రయత్నం లో ఉన్నారు .  అయితే కేసీఆర్ మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లోను ప్రజాప్రతినిధులు ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే పలువురు ఎమ్మెల్యేలు ఈ విపత్కర పరిస్థితుల్లో నియోజకవర్గ కేంద్రం లో ఉండకుండా ముఖం చాటేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి .

 

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ , ఎమ్మెల్యేలు కనీసం తాము ఎలా ఉన్నామో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని , తమ కష్టాలు ఎవరికీ చెప్పుకోవాలంటూ ప్రజలు  వాపోతున్నారు . కరోనా విస్తృతిని అడ్డుకునే క్రమం లో ప్రజల మధ్య ఉంటూ వారికి తామున్నామనే భరోసా కల్పించాల్సిన ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం పట్ల జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది .  

మరింత సమాచారం తెలుసుకోండి: