కరోనా వైరస్ పై అసత్య ప్రచారాలు , సోషల్ మీడియా లో వదంతులు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి . దీనితో సైబర్ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు . హైదరాబాద్ రెడ్ జోన్లను ఏర్పాటు చేశారన్న వదంతులపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు . అదే సమయం లో గాలిలో కరోనా వ్యాప్తి చెందుతోందని  రూమర్లు క్రియేట్ చేస్తున్న వారిపై కూడా నిఘా పెట్టినట్లు చెప్పారు . సోమవారం తెలంగాణ లో  ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇందులో కరీంనగర్ లో రెండు కేసులు నమోదయ్యాయి .

 

 దీనితో కరోనా బారిన పడిన వారి సంఖ్య 77 కు చేరుకోగా , ఇందులో  14 మందిని సోమవారం  డిశ్చార్జి  చేశారు  . తెలంగాణ లో తొలికరోనా బాధితుడు ఇప్పటికే డిశ్చార్జి కాగా , నేడు మరొక 13 మంది ఆరోగ్యం మెరుగుపడడం తో డిశ్చార్జి చేసినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు . తెలంగాణ లో ప్రస్తుతం 60  మంది కరోనా పాజిటివ్ బాధితులుండగా , మార్చి రెండవ తేదీన తెలంగాణ లో తొలిపాజిటివ్ కేసు నమోదయిన విషయం తెల్సిందే  . అయితే దేశం లోని ఇతర రాష్టాలతో పోలిస్తే,   కరోనా కట్టడి లో తెలంగాణ విజయవంతమైనట్లేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి .

 

ఇదే పరిస్థితి కొనసాగితే ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నట్లుగా వచ్చే నెల ఏడవ తేదీనాటికి తెలంగాణ కరోనా నుంచి పూర్తిగా  విముక్తి పొందే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు .   తెలంగాణ లో కరోనా బారిన పడిన మరొక వ్యక్తి మరణించాడు . దీనితో కరోనా బారినపడి తెలంగాణ లో రెండవ వ్యక్తి మృతి చెందినట్లయింది . అయితే మృతుడి వివరాలను వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించలేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: