ప్రపంచవ్యాప్తంగా కరోనా కష్టాలు ప్రపంచ దేశాలన్నిటిని అతలాకుతలం చేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా ఈ వైరస్ బారినపడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం కరోనాను నిలిచిపోయే విధంగా కష్టాలు ఎదురవుతున్నాయి. అసలు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే నాటికి తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉంది. అయినా చంద్రబాబు తన సమయస్ఫూర్తితో పార్టీని ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీ బరువు బాధ్యతలు చంద్రబాబు ఒక్కరే మోస్తూ వచ్చారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకుంటూ చంద్రబాబు ఒంటి చేత్తో పార్టీని ముందుకు నడిపించారు. ఇంత వరకు బాగానే ఉన్నా చంద్రబాబు వయసు రీత్యా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైకి చెప్పకపోయినా ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.


 ఈ దశలో తనకు విశ్రాంతిని ఇస్తూ పార్టీ బాధ్యతలు మోసే నాయకులు ఎవరూ ప్రస్తుతానికి చంద్రబాబుకి కనిపించడం లేదు. తన రాజకీయ వారసుడు లోకేష్ పార్టీ పరిస్థితి మెరుగు పరిచే విధంగా బాధ్యతలు స్వీకరిస్తాడా అంటే ఆయన సమర్థతపై పార్టీ నాయకుల్లో ఎవరికి పెద్ద నమ్మకాలు లేవు. ఈ కారణంగానే చంద్రబాబు బాగా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో కీలకంగా వ్యవహరించే నాయకులంతా ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకుంటూ అధికార పార్టీ వైసీపీ, కేంద్ర అధికార పార్టీ బిజెపిలో చేరిపోయారు. మరి కొంత మంది సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ వైసీపీతో సంప్రదింపులు చేస్తున్నారు. ఎమ్మెల్సీలు కూడా అదే బాటలో వెళ్తున్నారు.

 

 ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ఉన్నంతలో సమర్థులైన నాయకులను ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలి అని చూస్తున్నా... సమర్థులైన నాయకులు కొరత ఎక్కువగా టీడీపీ లో కనిపిస్తోంది. ఈ తరుణంలో పార్టీ భవిష్యత్తుపై బాబు కి బెంగ ఎక్కువ అయినట్లుగా కనిపిస్తోంది. పార్టీ తరఫున ఏ కార్యక్రమాలు నిర్వహించినా వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలు మీద వేసుకుంటే నాలుగేళ్ల పాటు ఆర్థిక భారం మోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అయినా తమకు ఎన్నికల్లో టికెట్లు ఇస్తారనే గ్యారెంటీ లేదనే భావం తో చాలామంది పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని ముందుకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: