`ర‌ష్యాలో ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు రాకుండా సింహాల‌ను వ‌దిలారు. ఇవిగో ఇవే ఆ దృశ్యాలు` అంటూ కొద్దిరోజుల కింద‌ట కొన్ని ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. అయితే అది నిజంగా కాద‌ని తేలింది. తాజాగా అలాంటి ఘ‌ట‌నే మ‌న దేశంలో జ‌రిగింది. లాక్‌డౌన్ ప‌ర్య‌వేక్షించేందుకు ఓ ఎనుగు మ‌న దేశంలోకి వ‌చ్చింది. ద‌ర్జాగా రోడ్ల‌పై తిరిగింది. ఎవ‌రెవ‌రు రోడ్ల‌పై ఉన్నారో గ‌మ‌నించింది. జ‌నాలు లేక‌పోవ‌డంతో... బ్ర‌తికి పోయారు అని చెప్పుకోవచ్చు.

 

ఇంత‌కీ ఈ ఘ‌ట‌న ఎక్కడ జ‌రిగిందంటే...కేరళలోని వాయనాడ్‌లో. ఈ ఏనుగు లాక్‌డౌన్ స‌మ‌యంలో సర్‌ప్రైజ్ విజిట్‌కు వచ్చిన అధికారిలా దర్జా ఒలకబోయడం, మూసిన దుకాణాలు, తలుపులను నిశితంగా గ‌మ‌నించింది. ఎక్కడి నుంచో వచ్చిన ఆ ఏనుగు ఖాళీగా ఉన్న వీధులను పరిశీలిస్తూ తనదారిన తాను వెళ్లిపోయింది. ఈ ఏనుగు హల్‌చల్ చూడడానికి జనమే లేరు. లాక్‌డౌన్ పుణ్యమా అని అందరూ తలుపులు వేసుకుని ఇంటికే పరిమితం అయ్యారు. ఓ మహిళ గుట్టుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. 

 

కాగా, స‌హ‌జంగానే ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అయింది. మనుషులు లాక్ డౌన్ సరిగా పాటిస్తున్నారా లేదా అని సదరు ఏనుగు పర్యవేక్షణకు వచ్చిందని నెటిజనులు జోకులు వేసుకుంటున్నారు. ఇంకొంద‌రు అయితే, లాక్‌డౌన్ పాటించ‌ని వారిని...ప్ర‌జ‌లంద‌రినీ ఇబ్బంది పెట్టే వారిని ఈ ఏనుగు తొక్కి చంపేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కాగా, ఈ ప్రాంతాల్లో ఏనుగుల సంచారం మామూలే. అప్పుడప్పుడూ అవి జనావాసాల్లోకి వస్తూనే ఉంటాయి. మొత్తంగా ర‌ష్యాలో సింహాలు నిజం కాక‌పోయినా...మ‌న ద‌గ్గ‌ర మాత్రం ఏనుగు రోడ్డెక్క‌డం నిజ‌మేనండి.

 

ఇదిలాఉండ‌గా, చండీగఢ్‌లోని సెక్టార్‌-5 జనావాసాల్లోకి సోమవారం ఉదయం చిరుతపులి రావడంతో జనం బెంబేలెత్తారు. జనావాసాల్లో చిరుత సంచరించడాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో మత్తుమందు ద్వారా దానిని బంధించి  పంజాబ్‌లోని జూకు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: