క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌లో భాగంగా ప్ర‌భుత్వం కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డంలేదు. ఇందులో భాగంగా విధించిన నిబంధ‌న‌ల‌తో చిరు వ్యాపారులు, రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. చేతి కొచ్చిన పంట‌ను అమ్ముకోలేక రైతులు అవ‌స్త‌లు ప‌డుతుంటే,  ప‌నులు దొరక్క కూలీలు అగ‌చాట్లు ప‌డుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని కుటుంబాల ప‌రిస్థితి మ‌రింత ద‌యనీయంగా మారింది. ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుం డా రోడ్ల‌పైనే వ్యాపారాలు నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ కొనుగోలుదారులు లేక కూలీ కూడా గిట్టుబాటు కావ‌డంలేదు. ఇలాంటి ఘ‌ట‌న‌నే ప్ర‌త్య‌క్ష్యంగా చూసి చ‌లించి పోయారు తిరుప‌తి అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి.

 

రోజువారి విధుల్లో భాగంగా తిరుప‌తి అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి తిరుప‌తిలోని  నెహ్రూ మున్సిపల్‌ గ్రౌండ్‌లోని తాత్కాలిక కూరగాయ‌ల మార్కెట్‌ను సోమవారం త‌నిఖీ చేశారు. ఈసంద‌ర్భంగా రోడ్డుపై కూర‌గాయ‌లు అమ్ముకుంటున్న ఓ వృద్ధురాలి క‌ష్టాన్ని చూసి ఆయ‌న క‌రిగిపోయారు.  మం డుతున్న ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుండా  కూరగాయలు అమ్మడానికి ఇబ్బందులు పడుతుండటం గమనించి ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఎండలో నీకెందుకమ్మా!?  ఇంతకష్టం? అని పలకరించారు. ఇంత వరకూ అమ్ముడుపోవడం లేదు నాయనా..  అని ఆమె దిగాలుగా బదులివ్వ‌డంతో ఆవేద‌నకు లోన‌య్యారు. సరేనమ్మా! నువ్వేమీ దిగులుపడొద్దు. అమ్మ లాంటి దానివి... ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వీ పనులు చేయొద్దు అంటూ ఆమె వద్ద ఉన్న కేరట్, వంకాయలు, పచ్చిమిర్చి మొత్తం ఆయనే కొన్నారు.

 

దీంతో ఆ వృద్ధురాలి ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయింది. అంతేగాకుండా ఆమె పక్కనే ఇదే పరిస్థితిలో ఉన్న మరో వృద్ధుడి నుంచి మూడు మూటల నిమ్మకాయలు సైతం కొనుగోలు చేశారు. తాను కొన్న వాటన్నింటీనీ అక్కడే ప్రజలు, పాత్రికేయులు, పోలీసులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆ తర్వాత మళ్లీ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆప్యాయంగా  ప‌ల‌కరించారు. ఆరోగ్యం కాపాడుకో తల్లీ!  అంటూ జాగ్రత్తలు చెప్పి పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: