కరోనా మహమ్మారి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోన్న ప్రస్తుత తరుణం లో ప్రజాప్రతినిధులంతా , ప్రజల్లోనే ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలను ఆదేశించారు . అయితే ఈ ఆదేశాలు నూతనంగా  ఎంపీగా  ఎన్నికైన పరిమళ్ నత్వానికి వర్తించవా ? అన్న ప్రశ్న తలెత్తొతుంది . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రముఖ పారిశ్రామిక వేత్త , రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహిత మిత్రుడు , వ్యాపారవేత్త అయిన పరిమళ్ నత్వాని ని  రాజ్యసభ కు నామినేట్ చేసిన విషయం తెల్సిందే .  

 

నత్వానికి రాజ్యసభ స్థానం  కోసం ఆఘమేఘాల మీద ముంబాయి నుంచి అమరావతికి ప్రత్యేక విమానం లో  విచ్చేసిన ముఖేష్ అంబానీ , ఈ విపత్కర సమయం లో మాత్రం  కనీసం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకపోవడం విస్మయాన్ని కల్గిస్తోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి . ఇక రాజ్యసభ సభ్యునిగా రాష్ట్రం నుంచి నామినేట్ అయిన పరిమళ్ నత్వాని కూడా  కనీసం రాష్ట్రంలోని పరిస్థితుల గురించి వాకబు చేసిన దాఖలాలు లేవు . అసలే లాక్ డౌన్ నేపధ్యం లో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు , సినీ , రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయనిధి కి తమవంతుగా విరాళాలను అందజేస్తూ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు . అయితే రాష్ట్రం నుంచి రాజ్యసభ కు ఎన్నికైన పరిమళ్ నత్వాని మాత్రం కనీసం తనవంతు విరాళాన్ని ప్రకటించకపోవడం విమర్శలకు దారితీస్తోంది .

 

దేశంలోనే పారిశ్రామిక దిగ్గజం సన్నిహితుడని భావించి , అధికార పార్టీ రాజ్యసభ కు నత్వాని ని నామినేట్ చేస్తే, ఆయన   తన బాధ్యతలను  విస్మరించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది .  రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోని  నత్వాని ,  కనీసం   తన పరిచయాలను ఉపయోగించుకుని సీఎం సహాయనిధికి ఏమైన విరాళాలు అందేలా చొరవ తీసుకున్నారా  ? అంటే అది లేకపోవడం తో,  ఆయన్ని రాష్ట్రం నుంచి రాజ్యసభ కు నామినేట్ చేయడం వల్ల ఒరిగిందేమిటో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే చెప్పాలన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: