మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల కాలంలో.. చాలా మంది ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించిన‌ట్లు వివిధ ర‌కాల పుస్త‌కాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ త‌ర్వాత వాళ్లంతా మ‌ళ్లీ హిందూ మ‌తాన్ని స్వీక‌రించ‌డం మొద‌లుపెట్టారు. బ్రిటీషు పాల‌న స‌మ‌యంలో ఆర్య స‌మాజం మతం మారిన వారిని శుద్దీక‌రించి హిందువులుగా స్వీక‌రించ‌డం ప్రారంభించింది. ఈ స‌మ‌యంలోనే త‌మ మ‌త ప్రాశ‌స్త్యాన్ని కాపాడుకునేందుకు మౌలానా ఇలియాస్ కంద‌ల్వి అనే వ్య‌క్తి ఇస్లాం మ‌త ప్ర‌చారం మొద‌లుపెట్టారు. హ‌ర్యానాలోని నుహూ జిల్లా నుంచి మౌలానా ఇలియాస్ కంద‌ల్వి 1927లో త‌బ్లిగీ జ‌మాత్ ఉద్య‌మాన్ని మొదలుపెట్టాడు.  ప్ర‌స్తుతం త‌బ్లిగీ జ‌మాత్ శాఖ‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 213 దేశాల్లో ఉన్నాయి. ఈ సంస్థ‌లో సుమారు 15 కోట్ల మంది స‌భ్యులుగా ఉన్నారు. ఈ మ‌త ప్ర‌చార‌కుల స‌మావేశ‌మే ప్ర‌స్తుతం ఢిల్లీలో జ‌రిగింది.

 

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలోని ‘తబ్లిగి ఏ జమాత్‌' మార్చి 1-15 మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి పలువురు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు పలు రాష్ర్టాల నుంచి వందల మంది ఇందులో పాల్గొన్నారు. మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గీజ్‌స్థాన్‌, చైనా, ఇంగ్లండ్‌, శ్రీలంక దేశాలకు చెందిన దాదాపు వందమంది  విదేశీయులు ఈ ప్రార్థనల కోసం మర్కజ్‌కు వచ్చారు. ఈ మత కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణవాసుల్లో ఆరుగురు ఇటీవల మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. ఇటీవల కరీంనగర్‌లో పాజిటివ్‌గా తేలిన ఇండోనేషియా వాసులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వచ్చినట్టు అనుమానిస్తున్నారు.  విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వీరిలో పలువురికి కరోనా వైరస్‌ సోకినట్టు ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. 

 

మర్కజ్‌ ప్రార్థనల్లో దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ముస్లింలు, మత బోధకులు పాల్గొనడంతో కరోనా వ్యాప్తి పై దేశ వ్యాప్తంగా ఆందోళన పెరిగింది.  ఇప్పటికే ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో రెండువేల మందిని క్వారంటైన్‌కు తరలించారు. నిజాముద్దీన్‌ ప్రాంతానికి చెందిన ఓ బృందంలోని 175 మందికి పలు దవాఖానల్లో సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీకి చెందిన 300 మందిని వివిధ దవాఖానలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మార్చి 15న ప్రార్థనలు పూర్తయినప్పటికీ.. 1400 మంది ఇంకా మసీదులోనే ఉండిపోయారు. వీరందరికీ కరోనా పరీక్షలు జరుపుతున్నారు.  మర్కజ్‌ భవనంతో సహా నిజాముద్దీన్‌ ప్రాంతాన్ని ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకొన్నాయి. స్థానికుల కదలికలపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: