దేశ వ్యాప్తంగా రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా  భూతాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కీలక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్  విధిస్తూ ప్రకటన కూడా చేసింది. దీంతో దేశంలో అన్ని రంగాలు మూతపడ్డాయి. దేశ ప్రజలందరూ ఇంటికే పరిమితమై పోయారు. ఇలా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. కేవలం ప్రజలకు అత్యవసర సేవలు మినహా... మిగతా సేవలు అన్నింటిని మూసివేసి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రజలు ఎవరు ఇంటి నుంచి కాలు బయట పెట్టకూడదు అంటూ సూచించింది. 

 

 

 అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో... ఉత్తరప్రదేశ్  రాష్ట్ర ప్రజలు కరోనా  వైరస్ పై  చేస్తున్న యుద్ధంలో భాగంగా... ప్రజలకు కొన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. బాధితులకు మందులు పంపిణీ చేయడం, అత్యవసర వస్తువులను అందించడం సహా పలు సదుపాయాలను ప్రజలకు అందించే విధంగా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ను  యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజలు ఎమర్జెన్సీ హెల్ప్లైన్ ద్వారా పలు సదుపాయాలను పొందవచ్చు. 

 

 

 అయితే కొంతమంది ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉంచిన ఈ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఓ వ్యక్తి సమోసాలు కావాలని అడిగాడట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు సదరు వ్యక్తికి ఫోన్ ద్వారా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అతను మాత్రం పట్టించుకోకుండా పదేపదే కాల్ చేస్తూ సమోసాలు కావాలి అని అడగడం ప్రారంభించాడు. అయితే ఈ విషయంపై రాంపూర్ జిల్లా కలెక్టర్ సోషల్ మీడియా వేదికగా ఏం జరిగింది అనే విషయాన్ని వెల్లడించారు. మొదట ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కి కాల్ చేసి సమోసాలు కావాలి అని అడిగిన వ్యక్తికి హెచ్చరికలు జారీ చేశామని ఆ తర్వాత అతనికి సమోసాలను అందించాము అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అతనికి పనిష్మెంట్ కింద రహదారులను శుభ్రం చేయించామని తెలిపారు. లాక్ డౌన్  సమయంలో ప్రజలు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటూ ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: