బ్యాంకుల ట్విస్టులో ఇది పీక్స్ అనుకోవ‌చ్చు. సామాన్యుడికి సేవ చేస్తున్న‌ట్లు చెప్పుకొనే బ్యాంకులు త‌మ‌కు మాత్రం లాభం జ‌రిగే ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌ని ఓ ప్ర‌చారం ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అదే జ‌రిగింద‌ని అంటున్నారు. కరోనా అత్యవసర పరిస్థితి కారణంగా బ్యాంకు లోన్ల రీపేమెంట్‌, ఈఎంఐలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మూడు నెలల మారటోరియం విధించటం తెలిసిన సంగ‌తే. అయితే, ఇందులోనూ తిర‌కాసు ఉందంట‌. వ్యాపారం చేసే వాళ్ల‌కు ఓ లెక్క‌...ఉద్యోగం చేసే వాళ్లకు ఇంకో లెక్క ఉంద‌ట‌. ఆర్‌బీఐ ఆర్డ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ...మ‌న‌కు పెద్ద‌గా లాభ‌మేమీ ఉండందంటున్నారు.

 


కరోనా మహమ్మారితో దేశంలో నెలకొన్న ఆర్థిక విపత్కర పరిస్థితులు ప్రజలందరినీ ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఆర్బీఐ ఈ మూడు నెలల వెసులుబాటును కల్పించింది. అయితే, ఇది ఎలా అమ‌లు చేస్తాయ‌నే దానిపై క్లారిటీ లేదు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకైన‌ ఎస్‌బీఐ తమ కస్టమర్లందరి టర్మ్‌ లోన్లు ఆటోమేటిగ్గా మూడు నెలలు వాయిదా పడుతాయని ప్రకటించినట్లు సమాచారం. కానీ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. మిగ‌తా బ్యాంకుల వారికి అయితే, అసలు మారటోరియం తీసుకుంటే లాభమా?.. నష్టమా?.. అన్నది తెలియని సంకట స్థితిలో ఉన్నారు. కొన్ని సంస్థలు ఈ విధానం కోసం ఆన్‌లైన్‌ అభ్యర్థనల్ని స్వీకరిస్తున్నట్టు తెలుస్తున్నది. కరోనా వైరస్‌ వల్ల తమ ఆదాయం పడిపోయిందని, ఈఎంఐలను చెల్లించలేని స్థితిలో ఉన్నామని రుణదాతలకు మీరు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది విశ్వసనీయంగా ఉంటేనే మీకు మారటోరియం అవకాశం లభిస్తుందట‌.

 

ఇక్క‌డే ఇంకో ట్విస్ట్‌.  కరోనా ధాటికి ఆదాయం ప్రభావితమైనవారందరికీ ఆర్బీఐ నిర్ణయం మాత్రం  గొప్ప ఊరటే. అయితే,  వేతన జీవుల కంటే వ్యాపారులకు ఈ మారటోరియం ఎక్కువ లాభమని నిపుణులు చెప్తున్నారు. నగదు  కొరత లేని వారు ఈఎంఐలను యథాతథంగా చెల్లించుకుంటేనే లాభమని విశ్లేషిస్తున్నారు. మారటోరియం అంటే ఈఎంఐల రద్దు కాదని, వాయిదా మాత్రమేనంటూ మారటోరియం తీసుకోవాలని అనుకున్న వారు ఈ మూడు నెలల మొత్తం ఆపడం వల్ల అంతకంటే ఎక్కువ లాభం ఉంటుందా? అన్నదానిపై ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: