తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాజ‌న్న సిరిసిల్లా జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ విష‌యంలో త‌న పుర‌పాల‌క శాఖ ద్వారా ప‌నులు స‌మ‌గ్రంగా ప‌ర్య‌వేక్షిస్తున్న కేటీఆర్ త‌న సొంత జిల్లా విష‌యంలోనూ ఫోక‌స్ చేశారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌తో మాట్లాడారు. జిల్లాలో రైతులు తమ పొలాలలో పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, వ్యవసాయ మార్కెట్ యార్డులలోకి రైతులు ధాన్యం తీసుకురాకూడదన్నారు. కరోనా నేపథ్యంలో రైతులకు టోకెన్లు జారీ చేసి దశల వారీగా గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 13 మండలాలలో 1,32,992 ఎకరాలలో రబీ 2019-20 కాలానికి వరి పంటని పండించడం జరిగిందని, ఈ సీజన్ లో మొత్తం 3,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యము కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నామని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs), గ్రామ రెవిన్యూ అధికారులు(VROs), మండల వ్యవసాయ అధికారులు (MAOs), మండల తహసిల్దార్లు (MROs),గ్రామ, మండల, రైతు బంధు సభ్యులు, కోఆర్డినేటర్లు అందరూ సమన్వయముతో ఆయా గ్రామాలలోని రైతులకు టోకెన్లు జారీ చేసి, దాని ప్రకారం రైతులు వరి ధాన్యం కోసి, సెంటర్లకు తీసుకువచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి పేర్కొన్నారు. 

 

ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న 141 హర్వేస్టర్లు( వరి కోత యంత్రాలు ) యంత్రాలతో పాటు మరిన్ని హర్వేస్టర్లను ( వరి కోత యంత్రాలను ) ఇతర జిల్లాల లేదా ఇతర ప్రదేశాల నుండి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేయాలని అన్నారు. రైతులందరూ ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా వారిని చైతన్యము చేయాలన్నారు రైసు మిల్లర్ యజమానులు , మధ్యవర్తులు కూడా వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధర రైతులకు చెల్లించి రైతుల దగ్గర కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి వసతులు కల్పించడంతో పాటు, సానిటేషన్ చేయించాలని, కొనుగోలు కేంద్రాలలో, అందరూ సామాజిక దూరం పాటించాలని, ఎట్టి పరిస్థితులలో సంబంధిత రైతులు , హమాలీలు, ట్రాన్స్ పోర్ట్ వ్యక్తులు , కొనుగోలు కేంద్రాలలో పని చేసే సిబ్బంది మినహా ఇతరులను కొనుగోలు కేంద్రాలలోకి అనుమతించకూడదని తెలిపారు. కొనుగోలు కేంద్రం నుండి రైసు మిల్లులకు ధాన్యం రవాణాకు అదనపు లారీలు సమకూర్చుకోవాలని ఆయన తెలిపారు.

 

క్వారంటైన్ లో ఉన్న వారిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా ఎస్పీ  రాహుల్ హెగ్డే ను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించి బయట తిరిగిన వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. వలస కార్మికులకు వారి యజమానులు మౌలిక వసతులు కల్పించేలా చూడాలని అన్నారు. నిత్యవసర వస్తువులను బ్లాక్ మార్కెటింగ్, నిల్వచేసిన,ఎక్కువ ధరలకు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాక్ డౌన్ సమయంలో జిల్లా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా చూడాలని అని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: