ఢిల్లీ శివారు నిజాముద్దీన్ మర్కజ్ మసీదు లో జరిగిన మతప్రార్ధనల్లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ తోపాటు తమిళనాడుకు చెందిన అనేక మంది కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణయింది . మంగళవారం తెలంగాణ లో 15 మందికి కరోనా వ్యాధి సోకినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు . అయితే వీరంతా మర్కజ్ మసీదుల్లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నవారు , వారి బంధువులే కావడం ఆందోళన కలిగించే అంశం . తెలంగాణ నుంచి ఈ ప్రార్థనల్లో  దాదాపు వెయ్యి మందికి పైగా పాల్గొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది .

 

ఈ వెయ్యి మందిలో ఎంతమంది కరోనా వ్యాధి బారిన పడ్డారన్న దానిపై స్పష్టత లేకపోగా, కరోనా బారినపడిన వారు  మాత్రం ఎవరెవర్ని కలిశారో , వారిలో ఎంతమంది ఈ వ్యాధి బారిన పడ్డరోనన్నదే ఇప్పుడు ప్రభుత్వ వర్గాలను , ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తోంది . ఇక ఆంధ్ర ప్రదేశ్ లోను మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న పలువురు కరోనా బారిన పడిన విషయం తెల్సిందే .  ఏపీ ఒక్కరోజే 17 మందికి  కరోనా పాజిటివ్ లక్షణాలు కన్పించగా , వారిలో ఎక్కువమంది మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కావడం ఆందోళన కలిగించే పరిణామం . రాష్ట్రం నుంచి 369 మంది ఢిల్లీ మతప్రార్ధనల్లో పాల్గొన్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి .

 

కర్నూల్ నుంచి వందమందికి పైగా ఈ ప్రార్థనల్లో పాల్గొనగా , కడప నుంచి 24 , కృష్ణా నుంచి 40 , గుంటూరు నుంచి 37 మంది హాజరయినట్లు వెల్లడించాయి . వీరందరిని గుర్తించి ఐసోలేషన్ కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది . ఇక తమిళనాడు లో ఒక్క రోజే 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా , అందులో 50 మంది మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని ప్రభుత్వం ప్రకటించింది .  

మరింత సమాచారం తెలుసుకోండి: