ప్రజా ప్రతినిధుల జీతాల  విషయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొట్ట  మొదటసారిగా ఎంఎల్ఏలు, ఎంఎల్సీల జీతాల చెల్లింపులను పూర్తిగా నిలిపేయాలని నిర్ణయం తీసుకోవటం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు దాదాపు పడిపోయాయి. అదే సమయంలో వైరస్ నియంత్రణకు చేయాల్సిన ఖర్చులు కూడా వందల కోట్లకు పెరిగిపోతోంది. దాంతో ఆదాయ-ఖర్చుల విషయంలో బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నాయి.

 

ఈ నేపధ్యంలోనే తెలంగాణా ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తు కేసియార్ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే జగన్ మాత్రం ఏపి ఉద్యోగుల విషయంలో కోతలు విధించకపోయినా రెండు వాయిదాల్లో చెల్లించాలని డిసైడ్ చేశాడు. అదే సమయంలో  తనతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత, మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీల జీతాలను తాత్కాలికంగా నిలిపేయాలని డిసైడ్ చేయటం సంచలనమనే చెప్పాలి. అంటే పరిస్ధితులు చక్కబడిన తర్వాత చెల్లిస్తారు లేండి.

 

అప్పుడెప్పుడో చైనా, పాకిస్ధాన్ దేశాలతో జరిగిన యుద్ధ సమయంలో ఎంఎల్ఏ, ఎంఎల్సీల జీతాల్లో కోత విధించారట.  ఆ తర్వాత ఎమర్జెన్సీ సమయంలో కూడా జీతాల్లో కోత విధించారే కానీ తాత్కాలికంగానే అయినా పూర్తిగా నిలపలేదు. కానీ ఇపుడు మాత్రం పూర్తిగా నిలిపేశారు. సిఎం, ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు మంత్రుల జీతాలు జీఏడి చెల్లిస్తుంది. అలాగే మిగిలిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీల జీతాలను అసెంబ్లీ సచివాలయం చెల్లిస్తుంది.

 

ఇటు జీఏడి అటు అసెంబ్లీ సచివాలయం ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుండి జీతాల నిలిపివేతపై ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. పరిస్ధితులు చక్కబడిన తర్వాత వీళ్ళ జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి ఉద్యోగులకు రెండు వాయిదాల్లో జీతాలు చెల్లించాలని నిర్ణయించిన జగన్ ప్రజా ప్రతినిధుల జీతాలను మాత్రం పూర్తిగా నిలిపేయటం సంచలనంగా మారింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: