కరోనా వైరస్ ఇపుడు ఎక్కడ ఉంది అంటే పక్కనే ఉందని చెప్పాలేమో. చాప కింద నీరులా విస్తరిస్తోంది. అనూహ్యంగా నంబర్లు పెంచుకుంటూ పోతోంది. నిన్నటి దాక సింగిల్ డిజిట్లో ఉన్న నంబర్లూ ఇపుడు డబల్ అయ్యాయి. ఇదే జోరు కొనసాగితే చాలా తొందరగానే కరోనా  పాకినట్లుగా భావించాలేమో.

 

ఆంధ్రాలో లాక్ డౌన్ ప్రకటించిన మొదటి  రెండు మూడు రోజులూ కూడా అర డజన్ మించి కేసులు లేవు. అదే ట్రెండ్ అలా కొనసాగుతూ వచ్చింది. ఆ తరువాత నుంచే సీన్  నెమ్మదిగా మారింది. ఆ నెమ్మదితనం కూడా మరో నాలుగైదు రోజులు ఉంది. ఇరవైకి నంబర్ రావడానికి వారం పడితే ఆ ఇరవై తొంబై కావడానికి మాత్రం కేవలం రెండు రోజులే పట్టింది. 

 

ఇదే జోరు కొనసాగితే మాత్రం ఏపీలో కరోనా కేసులు వందల్లో పరుగులు తీయడానికి అట్టే సమయం పట్టదేమోనని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలో కరోనా ప్రభావం పెద్దగా లేదనుకున్న వారంతా షాక్ తినేలా తాజా నంబర్లు కనిపిస్తున్నాయి. 


ఢిల్లీలో ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వారుగా భావిస్తున్న అనుమానితులతో ఏపీలో కరోనా నంబర్లు మొత్తానికి మొత్తం అనూహ్యంగా మారిపోయాయి. ఇక  రోజుకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. నిన్న  రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 మధ్య 43 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 87కి చేరింది. 12 గంటల్లో మొత్తం 373 శాంపిళ్లను పరీక్షించగా, వాటిల్లో 330 నెగిటివ్‌గా తేలింది.

 

ఈ 12 గంటల్లో కడపలో అత్యధికంగా 15, పశ్చిమ గోదావరిలో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ సర్కారు విడుదల చేసింది. కరోనా నుంచి ఏపీలో ఇప్పటివరకు మొత్తం ఇద్దరు కోలుకున్నారు.     

 

ఏది ఏమైనా ఏపీలో ఇపుడు కరోనా డంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణాతో పోలిస్తే నాలుగవ వంతు కేసులు నమోదుగా ఇప్పటిదాకా  కనిపించిన ఏపీలో ఈ రేంజిలో కొత్త కేసులు రావడం బట్టి చూస్తూంటే రానున్న రోజుల్లో మరెన్ని నమోదు అవుతాయోనన్న భయం,  బెంగ అందరిలో పట్టుకుంది.
     

 

మరింత సమాచారం తెలుసుకోండి: