కరోనా భయంతో ఈనాడు జగతి మొత్తం వణికి చస్తోంది. ఆ పేరు ఎంత పాపులర్ అయినా ఎవరి నోటితో వారు పలకడానికి కూడా జడుసుకుంటున్నారు.  ఎందుకంటే అది కరోనా కాబట్టి. సైలెంట్ కిల్లర్ కాబట్టి. కనబడని మరణ శాసనం కాబట్టి. మరి ఇలా కరోనాని అంతా ద్వేషిస్తున్న లోకంలో కరోనాని నచ్చుకోవాలంటే వారికి ఎంత గుండె  ధైర్యం ఉండాలో.

 

అది వింతలోకెల్లా వింతే మరి. అది కూడా ఈ దేశంలోనే జరుగుతుంది. అప్పట్లో లాలూప్రసాద్ యాదవ్ ని ఎమర్జెన్సీ టైంలో మీసా చట్టం మీద అరెస్ట్ చేస్తే ఆయనకు ఆ టైమ్ లో కూతురు  పుట్టింది ఆమెకు మీసా భారతి అని పేరు పెట్టుకున్నారు. అలాగే 80 దశకంలో ఈ భూమండలాన్ని స్కైలాబ్ అని ఒక గ్రహ శకలం హడలెత్తించింది. దాంతో అప్పట్లో పుట్టిన వారికి స్కైలాబ్ పేరు పెట్టేసుకున్నారు.

 

అలాగే కరోనా ఇపుడు అందరి నోటా  ఉంది. దాంతో ఉత్తర ప్రదేశ్ లో పుట్టిన ఓ ఆడ‌ బిడ్డకు కరోనా అని పేరు పెట్టుకున్నారుట. మార్చి 22న ఉత్తరప్రదేశ్ లోని  గోరఖ్ పూర్ లో దంపతులకు అమ్మాయి పుట్టింది. దాంతో ఆ అమ్మాయికి కరొనా అని పేరు పెట్టుకున్నారుట. ఇది నిజంగా విచిత్రమేనని అంటున్నారు. ఆ పేరు లోకమంతా  తలవడానికి భయపడుతూంటే కరోనా అని ఎలా పిలుస్తారో. వారికి మరి అంతగా నచ్చేసింది ఆ పేరులా ఉంది.

 

అదే విధంగా అదే ఉత్తర ప్రదేశ్ లో  దియోరియా జిల్లాకు చెందిన  దంపతులకు మార్చి 30న  బాబు పుట్టాడు. ఆ బాబుకు లాక్ డౌన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ ఉంది. దాంతో బాబుకు దానికి గుర్తుగా లాక్ డౌన్ అని పెట్టుకున్నారుట. మొత్తం మీద చూసుకుంటే ఈ రెండు పేర్లు ఇపుడు ప్రపంచ నామస్మరణగా ఉన్నాయి. మరి చరిత్రలో నిలవాలనుకున్నారో ఏమో కానీ పాప కరోనా అయితే బాబు లాక్ డౌన్ అయిపోయాడు. రేపు ఈ ఇద్దరూ పెద్ద అయి ఏ చరిత్ర స్రుష్టిస్తారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: