ఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు జరిపిన పరీక్షల్లో 43 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 14 మందిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ అని తేలిందని సమాచారం. ఏపీ మంత్రి పేర్ని నాని స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. పాజిటివ్ కేసులుగా నమోదైన 43 మందిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. 
 
పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆశ్చర్యపోయామని చెప్పారు. వారిలో జలుబు, గొంతునొప్పి, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు లేవని... లక్షణాలు లేకపోయినా కరోనా సోకవచ్చని అన్నారు. వ్యాధి లక్షణాలు లేకపోయినంత మాత్రాన కరోనా సోకలేదని అనుకోవద్దని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్రంలో ప్రస్తుతం భయపడే పరిస్థితి నెలకొందని చెప్పారు. 
 
ఒక్కరోజే 43 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 87కు పెరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని... ప్రజలు పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని సూచించారు. ప్రజలు స్వీయ నియంత్రణతో పాటు సామాజిక దూరం పాటించి కరోనా భారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇకనుండైనా ప్రజలు రాకుండా ఉంటే మంచిదని చెప్పారు. 
 
రాష్ట్రంలో ఇప్పటికే విజయవాడ, కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించామని చెప్పారు. ఇంట్లో నుంచి ఒక నిమిషం కూడా బయటకు రాకుండా ఉండటమే అని ప్రకటన చేశారు. రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో 24 గంటల కర్ఫ్యూ విధించినట్లు పేర్కొన్నారు. 6 నుంచి 11 గంటల వరకు బయటకు వెళ్లే సదుపాయం కొన్ని ప్రాంతాలలో కల్పించామని... ప్రజలు అత్యవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: