ఇప్పుడు ఎవ‌ర్ని క‌దిలించినా క‌రోనా గురించే ప్ర‌స్తావ‌న‌, ఆందోళ‌న‌! ఈ మ‌హ‌మ్మారి ఎలా విస్త‌రిస్తోందో భ‌యంతో చ‌ర్చించుకుంటున్నారు. ఏం జ‌రుగుతుందో అని టెన్ష‌న్ అవుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం సామాన్యుడిని షాక్‌కు గురి చేస్తోంది. క‌రోనాతో లాక్‌డౌన్‌, వేత‌నాలు ఆల‌స్యం, ఉద్యోగాలు పోతాయ‌నే భ‌యం ఇంకొంద‌రిలో ఉన్న త‌రుణంలో....ఇలాంటి చ‌ర్య‌లు ఎందుక‌ని అంటున్నారు. ఇంత‌కీ ఇది దేని గురించంటే...మొబైల్‌ ఫోన్లు, పలు విడి భాగాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పెంపు. దాని ద్వారా జేబుకు ప‌డే బొక్క గురించి.

 

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాల‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తున్న‌ట్లు తెలిపింది. భారత ప్రభుత్వం మొబైల్‌ ఫోన్లపై జీఎస్టీని పెంచడంతో తమ స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా పెంచుతున్న‌ట్లు  కంపెనీలు ప్ర‌క‌టిస్తున్నాయి. చైనాకు చెందిన‌ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి త‌న ఉత్పత్తులైన‌ రియల్‌మి 6, రియల్‌మి ఎక్స్‌2, రియల్‌మి ఎక్స్‌టీ మోడళ్లపై ధరలు పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. ఇంత‌కీ ఎంత పెరిగింది అంటారా... రియల్‌ మి కంపెనీకి చెందిన మూడు మోడళ్లపై కనీసం రూ.1000 పెరిగింది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన రియల్‌మి 6 స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను మార్చి11 నుంచి ప్రారంభించగా....దాదాపు 20 రోజుల వ్య‌వ‌ధిలోనే ధ‌ర పెర‌గ‌డం గ‌మ‌నార్హం. కేంద్రం నిర్ణ‌యంతో పెరిగిన పన్ను భారంతో మొబైల్‌ ఫోన్ల ధరలు కూడా పెరగడం ఆఖ‌రికి భారం ప‌డేది సామాన్యుల‌పైనే అంటూ ప‌లువురు వాపోతున్నారు.

 

కాగా,  ఇప్పటికే కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనా నుంచి మొబైల్‌ తయారీ విడిభాగాల సరఫరా భారత్‌కు నిలిచిపోయింది. దీంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఇదే స‌మ‌యంలో గ‌త నెల‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరిగిన 39వ జీఎస్టీ మండలి సమావేశంలో  మొబై ల్‌ ఫోన్లు, పలు విడి భాగాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 18 శాతానికి పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో జీఎస్టీ పెంపు.. ఫోన్ల ధరలకు రెక్కలు తొడగవచ్చన్న అభిప్రాయాలు పరిశ్రమ నుంచి వ్యక్తమయ్యాయి. అదే నిజ‌మైంది. కాగా, రియ‌ల్‌మీ వ‌లే మిగ‌తా కంపెనీలు కూడా ధరలు పెంచితే మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోవచ్చన్న ఆందోళనా వ్యాపారుల్లో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: