తెలంగాణ హోంమంత్రి మ‌హమూద్ అలీ కేంద్రంగా సంచ‌ల‌న వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి,వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలు, ఇతర అంశాలపై చర్చిస్తున్న త‌రుణంలో... హోంమంత్రి మ‌హమూద్ అలీకి ప్ర‌వేశం ద‌క్క‌లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నో చెప్ప‌డంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు మ‌హ‌మూద్ అలీని లోప‌లికి రానివ్వ‌లేద‌ని, దీంతో ఆయన ప్రగతి భవన్​ నుంచి వెనక్కి వచ్చినట్లు కొన్ని మీడియా సంస్థల్లో ప్ర‌చారం జ‌రిగింది. 

 

ఈ పరిణామం పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో హోం మంత్రి మహమూద్ అలీ క్లారిటీ ఇచ్చారు. త‌నపై తప్పుడు ప్రచారం సరికాదని ఆయ‌న పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాజభవన్ వెళుతున్నారని తెలిసి వెనక్కు వచ్చానని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్రగతి భవన్లోకి రావద్దని త‌నకు ఎప్పుడూ, ఎవరు చెప్పలేదని మహమూద్​ అలీ అన్నారు. కనీసం త‌న వైఖ‌రి కూడా తెలుసుకోకుండా వార్తలు వేయడం బాధాకరమ‌ని మ‌హ‌మూద్ అలీ వాపోయారు.

 

కాగా తెలంగాణ‌ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో ఈ సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, హెల్త్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల స్థితిగతులను, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, లాక్‌డౌన్‌ అమలు, పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ, నగదు పంపిణీ, ఇతర పరిస్థితులను గవర్నర్‌కు వివరించారు. కాగా, వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, పరిస్థితులను తెలుసుకుంటున్నామ‌ని  సీఎం కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించిన‌ట్లు స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: