అవును అచ్చంగా ఇదే అంశంపై ఇపుడు రాష్ట్రంలో  చర్చ జరుగుతోంది. సమస్య వచ్చినపుడల్లా దూరంగా పారిపోవటం చంద్రబాబుకు మామూలైపోయింది. పైగా తననెవరూ భయపెట్టలేరని, తాను ఎవరికీ భయపడేరకం కాదని సొల్లు కబుర్లు మళ్ళీ. ఇదంతా ఎందుకంటే కరోనా వైరస్ విషయంలో జనాలను భయపెడుతూ, ప్రభుత్వాన్ని తప్పు పడుతూ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిపై ప్రతిరోజు బురద చల్లేస్తున్న చంద్రబాబు ఎక్కడున్నట్లు ? ఎక్కడంటే హైదరాబాద్ లో ఉన్నాడు.

 

ఏపికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రంలో  సమస్య వచ్చినపుడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నట్లు ? ఆయనంతే సమస్య ఉన్న చోట చంద్రబాబు ఉండడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే మొదటిసారి కాదులేండి. ఎప్పటి సంగతులో ఎందుకు లేండి. రీసెంటుగా అందరికీ తెలిసిన సంగతులే మాట్లాడుకుందాం. 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే తెలంగాణా ఎంఎల్సీ ఎన్నికలు జరిగాయి గుర్తుంది కదా ?

 

అవునే అదే లేండి ఎలా మరచిపోతారు ఓటుకునోటు కేసు. అసలు గెలిచే అవకాశం లేని ఎన్నికల్లో అభ్యర్ధిని నిలబెట్టాడు చంద్రబాబు. పోటి పెట్టిందే కాకుండా కేసియార్ స్వయంగా నామినేట్ చేసిన ఎంఎల్ఏ ఓటు కొనేందుకు బేరం చేసి అడ్వాన్సుగా డబ్బు కూడా పంపించాడు. ఎంఎల్ఏకి డబ్బు ఇస్తున్నపుడు అప్పటి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. అప్పట్లో ఆ సంఘటన దేశంలో పెద్ద సంచలనం. ఎప్పుడైతే రేవంత్ అరెస్టయ్యాడో  తనను కూడా ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో  అర్ధరాత్రి హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయాడు.

 

అరెస్టు దెబ్బకు విజయవాడ పారిపోయిన చంద్రబాబు చాలా కాలం అసలు హైదరాబాద్ లో అడుగే పెట్టలేదు. ఏదో పద్దతిలో పదవీ కాలాన్ని గడిపేసిన చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వరదలు, భారీ వర్షాలు వచ్చాయి గుర్తుందా ? అప్పుడు కూడా తానుంటున్న  అక్రమ కట్టడం ఎక్కడ ముణిగిపోతుందో అన్న భయంతో విజయవాడ నుండి  హైదరాబాద్ కు పారిపోయాడు. వరదలు, వర్షాలు తగ్గేంత వరకూ మళ్ళీ విజయవాడ వస్తే ఒట్టు. ఇపుడు కరోనా వైరస్ దెబ్బకు మళ్ళీ విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ లో కూర్చున్నాడు.

 

విచిత్రమేమిటంటే కేసియార్ పై ఆరోపణలు, విమర్శలు చేయాలంటే విజయవాడ నుండి మాట్లాడేవాడు. అలాగే సమస్యలు వచ్చినపుడల్లా జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయాలంటే హైదరాబాద్ లో కూర్చుని రాళ్ళు విసురుతున్నాడు. నిజంగా ధైర్యమంటే చంద్రబాబుదే కదా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: